నిశ్చల నిర్జీవం
మరుమల్లియ సొగసులను
తడిమి చూశాను
గులాబీ రేకుల్లో
పరిమళాన్ని వెతికాను
తీయని పాటల కొలికి
కోయిలమ్మ గానంలో
తేనీయలు శోధించాను
కడలి కెరటాల పరుగులకు
చేతులు చాచాను
గౌతమి పరుగులలో
మీనమై ఉరికాను
చల్లని జాబిలితో
వెన్నెల స్నానం చేయాలని
తపించాను
ఏమయ్యింది నాకు
మరుమల్లియ సొగసులో
లాలిత్యం లేదు
గులాబీ రేకులలో పరిమళం
దొరకలేదు
కోయిల గానంలో మధురసం
లేనే లేదు
కడలి కెరటాలు
గౌతమి హోరు
నిస్తేజంగా
అనిపిస్తున్నాయి
ఏమయ్యింది నా
అక్షరాలకు
ఏమయ్యింది నా భావాలకు
అక్షరాలు అవసాన దశకు
చేరాయా
భావాలు బండబారాయా
ఏమో
నాలో భావం
ముభావమయ్యిందేమో
నిశ్చల నిర్జీవ
భావాల్లో
అక్షర పుష్పాలు వాడిపోతున్నాయి
మనస్వినీ
No comments:
Post a Comment