Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 12 June 2016

నిశబ్దయవనిక

నిశబ్దయవనిక 

పెదవిని శాసించే మౌనం
గుండెనిండా పరుచుకున్న నిశబ్దం
నిశిలాంటి నిశబ్ద యవనికపై
తారాడే నీ రూపం
ఎంత అద్భుతం ఆ మౌనం
ఎంత మధురం ఆ నిశబ్దం...
పెదాలను జారని పలుకులతో
నీతో మాట్లాడుతూనే ఉంటా నేను
మదినిండా నిశబ్దాన్ని అలుముకున్న నీవు
గాలిసోకని మాటలే చెబుతుంటావు...
నువ్వెప్పుడూ అంటూ ఉంటావు చూడు
ఏమిటీ మౌనంగా ఉన్నావనీ
ఏదో ఆలోచిస్తున్నావనీ...
నిజమే నేను మౌనంగానే ఉన్నా
నిశబ్దవీణ తంత్రులే మీటుతున్నా
భౌతికంగా నువ్వు నా ఎదురుగానే ఉన్నా
నా కన్నులముందు నిలిచే ఉన్నా
అక్కడనుంచి మాయం చేసాను నిన్ను
మౌనమనే వీధిని దాటి
నిశబ్దమనే రాజ్యంలోకి నిన్ను తీసుకుపోవటం
నాకు నిత్యం అలవాటే...
దైనందిక ముచ్చట్లు
రోజూవారి ఘర్షణలు
ఎగసిపడే ఆవేశతరంగాలు
నిశిరాతిరి సరాగాలు
అలుకలు అనుమానాలు
ఓటమి రుచిచూపే జీవనరాగాలు
ఇవన్నీ కాకుండా
మరో జీవితం ఉంది నాకు
అదే నిశబ్ద జీవితం
ఎక్కడా దొరకని సాంత్వన అందించే దివ్య ఔషధం...
అందుకే మౌనాన్ని పెదాల మాటున దాచి
నిశబ్దాన్ని గుండెనిండా పరిచి
నీతోనే మాట్లాడుతూ ఉంటాను
గంటలకొద్దీ అదే లోకంలో ఉంటాను
భవబంధాలకు దూరంగా...
ఒక్కసారి తొంగి చూడు
నిశబ్దం తెరలను కాస్త తొలిగించి చూడు
అక్కడ నువ్వే కనిపిస్తావు
మనస్వినీ...

No comments:

Post a Comment