Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 24 June 2016

అధినేత్రి

అధినేత్రి

తొలిసారి తనను చూసినప్పుడు
అనిపించింది
తనే నాలో చిగురించిన స్వప్నమని
నా మనసులో కొలువైన మనస్వినియని...
అప్పటికి తనెవరో నాకు తెలియదు
తన వెనుక ఏముందో
తన గతమేమిటో
నాకు తెలియనే తెలియదు...
మలిసారి తను కలిసినప్పుడూ
నాకేమీ తెలియదు
తెలిసింది ఒకటే
అది ప్రేమయని...
ఈ వయసులో ప్రేమ ఏమిటనే తర్కం జోలికి
నేను పోదల్చుకోలేదు
నాలో ఉన్నది వ్యామోహం కాదు
నాలో నిత్యం సమరం చేసే స్వప్నమని
తెలుసుకున్నాను...
తనెవరో తెలియకనే ప్రేమించా
ఎవరో చెబితే విన్న నేను
తననే అడిగా
నీకు కోట్ల ఆస్తి ఉందటగా అని...
అప్పటికి తను నా శ్రీమతే
తను తెలిపేదాకా తెలియదు నాకు తనెవరో
తనకెన్ని ఆస్తులున్నాయో...
అయినా నా ప్రేమ మారలేదు
తనలో నాకు డబ్బు దర్పం కానరాలేదు
నేను తనలో చూసింది
మనసూ మమత
అంతులేని అనురాగమే...
తను స్వయంగా చూపే వరకు తెలియదు నాకు
తనెంత పెద్ద వ్యాపారసామ్రాజ్యానికి అధినేత్రియో...
ఏమీ తెలియనినాడే ప్రేమించా
ఏమీ తెలియకనే
ప్రేయసిగా
ప్రియురాలిగా
స్నేహితురాలిగా
శ్రీమతిగా
మనస్వినిగా
మలుచుకున్నా...
కుక్కమూతి పిందెలు ఎన్ని అర్థాలు తీసినా
మా ప్రేమ నిజం
మా బంధం అజరామరం...
ఏమీ తెలియని స్థితిలో
ఆ ప్రేమకు నేను దాసోహమైతే
ఆస్తివాదం ఎందుకు వచ్చిందో తెలియదు...
అందరిలాగానే
నా కుటుంబంలోనూ కలతలున్నాయి
విభేదాలున్నాయి
అంతరాలున్నాయి
ప్రేమ కలహాల సంగమం మా జీవితం...
ఆస్తులకోసమే వ్యూహం పన్ని ఉంటే
మాలో కలహాలు ఎందుకు
అసలు తెలియనే తెలియని ఆస్తులకోసం
వ్యూహ రచనలు ఎలా చేస్తా...
మనీ కోసం మనుషులను
మమతలను అపహాస్యం చేసే
వంకరమనుషులకు నేను చెప్పేది ఒకటే
యస్...
వయసు మతం ఇవేమీ మాకు తెలియదు
మేము ప్రేమించుకున్నాం
జీవితాలను పంచుకున్నాం
కలిసే ఉంటాం
మనీ మీకు జీవితం కావచ్చు
మనీ కోసమే మీ జీవితం కావచ్చు
మాకు జీవించేందుకే మనీ...
మళ్ళీ మళ్ళీ చెబుతున్నా
చిల్లిగవ్వ లేకున్నా
మరణం కనులముందు నిలిచినా
చివరిశ్వాస వరకు
నా జీవన సామ్రాజ్య అధినేత్రి 
నా మనస్విని...

1 comment: