Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 14 June 2016

చిరాకు పడిన దేవుడు

చిరాకు పడిన దేవుడు  

ఆరోజు ఆదివారమేనేమో
ఏదో సెలవురోజే అయ్యి ఉంటుంది
కనీసం పండగ రోజైనా కావచ్చు
సెలవు దినం కావటంతో బ్రహ్మ
తీరికగానే ఉన్నాడేమో
ఏ పనీ లేక ఖాళీగా ఉన్న దేవుడు
నిన్ను సృష్టించే పని పెట్టుకున్నాడేమో
అవును చాలా తీరికగా
నీ బొమ్మ తయారు చేసి ఉంటాడు
ఏ బొమ్మనూ అనుకరించకుండా
ఎవరి గుణాలకూ అందకుండా
ఎవరి పోలికలు పడకుండా
ఎంతో ఓపికతో
ఎంతో జాగ్రత్తగా
నీ ఆకృతికి రూపమిచ్చాడేమో
అతిలోక సౌందర్యం కాదు
అయినా
కళ్ళు జిగేల్ మనే అందమే నీది
కోయిలపాట గానం కాదు నీది
శ్రావ్యమైన స్వరమే నీది
అందమైన బొమ్మకు రాజసం అద్దితే
మృధువైన గళానికి తేనె పూతలు జోడిస్తే
కనుల కొలనులో చందమామ వెన్నెలను కురిపిస్తే
మనసులో మమతల వెన్న అద్దితే
నువ్వు తయారయ్యావు
చాలా ఓపికగా
అలసటే లేకుండా
నీ బొమ్మకు ప్రాణం పోశాడేమో దేవుడు
అంతలోనే ఏమయ్యిందో
ఎవరు భంగం కలిగించారో
కొంచెం చిరాకుపడ్డాడు దేవుడు
ఎదురుగా నిలిచిన భార్యామణిని చూసి
ఆ చిరాకు
ఆ అసహనం
ఆ కోపం
దేవుడికి తెలియకుండానే
నీలో కలిసిపోయాయేమో
మనస్వినీ 

No comments:

Post a Comment