Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 26 June 2016

పెళ్లిరోజు శుభాకాంక్షలు మనస్వినీ...

పెళ్లిరోజు శుభాకాంక్షలు మనస్వినీ...

అభినందనలు నీకు అని అభిమానం చూపనా
థాంక్యూ అంటూ నుదుటన చుంబించనా
కృతజ్ఞతలు చెబుతూ
తలవంచి ప్రణమిల్లనా...
ఎలా తెలుపను మదిలో భావాలను
ఎలా పంచుకోను కమ్మని బాసలను
నా జీవితంలో అడుగిడిన నిన్ను
ఏమని కొనియాడను...
నీ అనురాగానికి భాష్యం పలుకగలనా
నీ అనుబంధానికి నిర్వచనం ఇవ్వగలనా
ఎలా పంచుకోను మనసు భావాలను...
నీతో పంచుకున్న ఘడియలు
నేను పొందిన మధురిమలు
ఎన్నెన్ని రాత్రులు
ఎన్ని సరాగాలు
మరిచిపోలేని అనుభూతులు
ఒక్కొక్కటి కనులముందు మెదలుతూనే ఉన్నాయి...
మోడువారిన మనోవృక్షానికి
కొత్త చివురు మొలిచినట్టుగా
ఎండమావుల సీమను తొలకరి  తాకినట్లుగా
నా జీవనంలో అడుగిడిన నీవు
నాకు నెరవేరిన స్వప్నానివే...
కలతలు పలకరించినా
తలవంపులు ముళ్ళ తివాచీలు పరిచినా
సమాజం గాయాలు చేసినా
మమతల లేపనం అద్ది
ఓదార్పుగా నిలిచిన మానవతవే నీవు...
కనుల ఉబికిన నీటిని రెప్పల మాటున దాచి
మనసున రేగిన అగ్గిని చిరునవ్వుతో ఆర్పి
నీలో నీవు కుమిలిపోతూ
నాకేమీ తెలియనీయకుండా
మనసులో కుమిలిపోతూ
నా వేదనను తనదిగా మలుచుకుంటూ
నాతో నడుస్తున్న నీవు
నిజంగా నాకు తోడూ నీడవే...
బదులుగా నీకేమివ్వగలను
బహుమతిగా ఏమిచ్చుకోగలను
కానుకగా ఏమి తేగలను
నీ ఔన్నత్య శిఖరానికి తలతూగే
బహుమానం ఉందా...
పెళ్లి రోజు కానుకగా ఏమివ్వగలను
మనసున కొలువైన నీకు
తుది ఘడియ దాకా ప్రేమించటం తప్ప...
నీకు చెప్పాలో
నాకు నేను చెప్పుకోవాలో
మనిద్దరికీ కలిపి చెప్పుకోవాలో
తెలియదుగానీ
పెళ్లిరోజు శుభాకాంక్షలు  
మనస్వినీ...

No comments:

Post a Comment