కొలనులో చందమామ...
రాగ రంజితమైన
సోయగం ప్రకృతి స్వంతం...
తన విశాలమైన కాన్వాసుపై
అందమైన బొమ్మలు గీసే దేవుడు
ప్రకృతినీ అందమైన
జవ్వనిలా మలిచాడు...
అది ఆయన ఇష్టం...
నెలవంక వెన్నెలలో
శశి వదనలా
తేలియాడే కరి మబ్బులను
కురులుగా
కడలి కెరటాలను
తన ఎద పొంగులుగా
ప్రకృతి లోని సమస్తాన్ని
ఒక ముగ్ధమనోహరిలా
మలిచేసి
ఆకాశం అంచు చీర చుట్టేస్తే
ప్రకృతిని మించిన అందగత్తె
ఇంకెవ్వరు...
సౌందర్య లహరీ
నీ వన్నె చిన్నెలు
ప్రకృతి కాంతకే పోటీ
ఇస్తున్నాయి...
విరిసిన పువ్వుల్లో
పరుగులు తీసే మేఘాల్లో
జారిపడే చినుకుల్లో
సెలయేటి రొదల్లో
కొలనుల కలువల్లో
నీ అందమే కనిపిస్తోంది...
నిన్ను చూసి ప్రకృతి
ముడుచుకు పోతోంది...
అలా కొలనులోని నీటిలో
తొంగి చూడకు
నీ ప్రతిబింబాన్ని ...
ఆ నీటిలో
నీ మోము కానరాదు...
అది చంద్రబింబం కాదా
మనస్వినీ...
No comments:
Post a Comment