ఎండలో
కరిగిన నీడ...
ఎవరు నేను ...
అవును ఎవరునేను...
నాకు నేనే తెలియటం లేదు...
నన్నెవరూ గుర్తు పట్టటం లేదు...
పరిచయమే లేని వాడిలా
చూస్తున్నారంతా...
అటూ ఇటూ
తిరుగుతూనే ఉన్నా
అందరినీ పలకరించే
ప్రయత్నం చేస్తున్నా
ఎవరూ పట్టించుకోరేమీ...
పూల తోటలోకి
తొంగి చూసాను...
నన్ను రోజూ చిరునవ్వుతో
పలకరించే పువ్వు
నన్ను చూసి మొహం మాడ్చుకుంది
పరిచయమే లేనట్టుగా...
మళ్ళీ నాలో సందేహం
నేనెవరినో అని...
చందమామను పలకరించాను
మబ్బుల్లోకి జారిపోయాడు
నన్ను అనామకుడిలా చూస్తూ...
తారకలు నింగిలో కలిసిపోయాయి
కన్నులు మూసుకున్నట్లు...
నా నీడను నేను చూసాను
అది ఎండలో కరిగిపోయింది...
నాతో సంబంధమే లేనట్లు...
అద్దంలో చూసుకున్నాను
నావైపు నేనే చూసుకుంటూ
కనిపించాను
పలకరిస్తున్నట్లుగా ...
అప్పుడు నాలో కొండంత ధైర్యం
నన్ను గుర్తు పట్టే వారు
ఒకరైనా ఉన్నారని
మనస్వినీ...
No comments:
Post a Comment