కడుపు నింపని కవితలు...
అవును
అక్షరాలా నిజం
కవితలు
కడుపు నింపవు...
భావుకతలు
బతకనీయవు...
బహదూర్ షా
జఫర్
అమీర్
ఖుస్రోల నుంచి
నేటి
ఆధునిక కవులందరూ
ఆగచాట్లు
పడిన వాళ్ళే...
దాస్య
బంధనాలను
ఎదుర్కొన్నారు...
కొరడా
దెబ్బలు తిన్నారు...
కడుపు
కాలుతున్నా కలం వీడలేదు...
డొక్కలు
ఎండుతున్నా భావం ఆగలేదు...
దో గజ్
జమీన్ భీ న మిలీ
అంటూ జఫర్
విలపించటం
నేటి
తరానికి తెలిసి ఉండకపోవచ్చు ...
ప్రపంచానికే
మరో ప్రపంచాన్ని కానుకగా ఇచ్చిన
శ్రీ రంగం
శ్రీ నివాసులవారి పాట్లు
ఎంతమందికి
తెలుసు...
ఆ
మహానుభావుల
కాలిగోటికి
సరిపోను నేను...
ఇంట్లో ఈగల
మోత
బయట
పల్లకీల మోత...
అందుకే
కుటుంబం
హర్షించదు
కవితల్ని...
నిజమే వారి
వాదనలో
తప్పేమీ
లేదు...
బాధ్యతలు
మరిచి
భావలోకంలో
విహరిస్తూ
తనవారిని
విస్మరిస్తే
తిరుగుబాటు
తప్పదు మరి...
నేనేం
చేయను...
తనకోసం
రాసుకున్న
అక్షరాలే
నాకు ఆహారం...
ఆ భావాలే
నాకిప్పుడు జీవనం
తప్పని
తెలిసినా
అక్షరాలనే
రొట్టెలుగా
తినేస్తూ
బతికేస్తున్నా
మనస్వినీ...
Very nice.
ReplyDelete