ముగిసిన సమరం
ఎందుకు నా మనసు
ఇప్పుడు
ప్రసవ వేదన పడుతోంది
ఎందుకు ఒక్కో అక్షరం
భారంగా బయటకు వస్తోంది
రానని బెట్టు
చేస్తున్న భావాన్ని
ఎందుకు మనసు ఎందుకు
బయటకు తోస్తోంది
అక్షరం భయపడుతోందా
భావం సిగ్గుపడుతోందా
మనసు అక్షర సన్యాసం
చేస్తోందా
ఏం జరుగుతోంది మనసులో
ఎందుకు ఇంత
అల్లకల్లోలం
తొలిసారిగా
ఎన్నడూ లేనంతగా
ఎందుకు ఈ కలవరం
నేను రాసుకున్న
అక్షరాలను చూసి
ఎందుకు జడుస్తోంది నా
మానసం
ఇంతగా గుచ్చుకుంటున్నాయి
ఎందుకు నా అక్షరాలు
గుండెలు పగిలేలా
ఏడుస్తున్నాయి ఎందుకు నా కవితలు
సమాజాన్ని ధిక్కరించిన
నా భావం
ఇప్పుడు ఎందుకు నన్నే
ధిక్కరిస్తోంది
సమాజాన్ని నిగ్గదీసి
ప్రశ్నించిన అక్షరం
మనసు ముందు ఎందుకు
బేలగా మారిపోయింది
లోపం ఎక్కడుంది
రాసుకున్న మనసులోనా
పరిమళించిన నా
అక్షరంలోనా
మనసులో లేనిదే
అక్షరాలుగా
కవితలుగా
మనసు భావాలుగా
రాసుకున్నానా
నా మనసును నేనే వంచన
చేసుకున్నానా
అందమైన మనసుపై
చందమామ మోముపై
కాలి అందియల సవ్వడిపై
ముచ్చటైన బిందియపై
మైమరిపించే సొగసుపై
నేను అల్లుకున్న
పదమాలికలు
పూజకు పనికి రాని
పువ్వులేనా
ఆలిలోని అనురాగం
గ్రహించి
చెలియలోని అమ్మతనం
రుచిచూసి
సహచరిలోని చేయూతను
స్మరించి
తనయుడినై
చంటి పిల్లాడినై
నేను చెప్పుకున్న మనసు
కథలు
కట్టు కథలేనా
నను నన్నుగా
ప్రేమించమని
చేసుకున్న వినతిలో
మనసు వేదన తెలుసుకొమ్మని
అల్లుకున్న కవితల్లో
నిజాయితియే లేదా
అన్నీ మనోవంచన
శిల్పాలేనా
అందుకేనా
నిన్నటి అక్షర
పుష్పాలు
మరలా వికసించబోమని
పంతం పట్టాయి
ఇక అక్షర సమరం
చేయబోమని భావాలు
అస్త్ర సన్యాసం
చేస్తామని అంటున్నాయి
ఏ భావమూ లేని నేను
నా అక్షరాలకు ప్రేమ
మరకలు అంటించిన నేరానికి
సిగ్గుపడుతున్నా
మనసైన మనసుకు మెడలో
గులాబీలుగా
అలంకరించిన అక్షరాలను
మరో మారు మనస్విని చరణాలకే
అంకితమిస్తూ
అక్షరసమరం ముగించి
వేస్తున్నా
No comments:
Post a Comment