స్మశాన విహారి
నిశి చీకటి రాజ్యంలో
నిష్క్రియాపరుడినై
భావరహిత మనస్కుడినై
చీకటి తెరలను భారంగా తోసివేస్తూ
అడుగు తీసి అడుగు వేస్తున్నా
దూరంగా ఏదో వెలుతురు
ఏదో కాలుతోంది
ఆ మంట దగ్గరయ్యేసరికి
ఏదో కాలుతున్న వాసన
అవును అవి చితిమంటలే
చితిమంటలలో కరిగిపోతున్న
స్వప్నాలను చూస్తూ
అప్రయత్నంగానే అటువైపు నడిచాను
మంటల వెలుగు చితివరకే పరిమితమై
ఉంది
ఎటుచూసినా నల్లని చీకటే
నా మనసులా...
కాలికి ఏదో తగిలింది
అది ఒక పుర్రె
అవును
కాలిపోకుండా
పగిలిపోకుండా
మిగిలి ఉన్న మనిషి పుర్రె
చివుక్కుమంది మనసు ఆ పుర్రెను
తన్నినందుకు
అది ఏ వైభవానికి చిహ్నమో
ఏ రాజసానికి ఆలవాలమో
మనసులోనే క్షమాపణలు కోరుకున్నా
అప్పుడు నవ్వింది ఆ పుర్రె
మిత్రమా నన్ను చూసి జాలిపడకు
నాకోసం కన్నీరు పెట్టకు
రాజాలా బతికిన నన్ను ఇప్పుడు
ఎవరో ఒకరు తోక్కుతూనే ఉంటారు
ఎవరికీ జాలి లేదు
నేనూ మనషికి ఉనికినే అన్న భావం
లేదు
వందలాది మంది నాతో బంతాట
ఆడుతునే ఉంటారు
అప్పుడనిపించింది నాకు
నాకూ ఆ పుర్రెకు తేడాయే లేదని
మరణంలోనూ మనిషికి ప్రశాంతత
లేదని
పుర్రె మాటలు చెప్పకనే చెప్పాయి...
భారమైన మనసుతో అడుగులు ముందుకు
వేసాను
చితిమంటలు దాటుకుంటూ
కారుచీకటిలోనూ
అక్కడ ఏవో మెరుపులు
చిందుతున్నాయి
కనులు పరికించి చూసాను
అవీ సమాధులే
స్మశానానికే అందాన్నిస్తున్నాయి
బాగా దగ్గరికి వెళ్లి చూస్తే
ఆ సమాధుల్లో మనీ మనుషులు
సేదతీరుతున్నారు
అల్లంత దూరంలో శిథిలమై
ఆనవాళ్ళు కోల్పోయిన మరికొన్ని
సమాధులు
ధీనంగా కనిపించాయి
ఇక్కడ కూడా తేడా ఉందా అని
నవ్వుకుంటూ
వెనక్కి తిరిగాను
ఈ లోకంలో జీవనమూ మరణమూ
ఒక్కటేనని అనుకుంటూ...
నా ఆషియానా కనిపించింది
కొత్తగా నిర్మించారు నాకోసమే
ఇంకా మట్టిలో తడివాసనే
వేస్తోంది
మెల్లగా అందులోకి దూరి కళ్ళు
మూసుకున్నా
ప్రతిరాత్రిలాగే...
No comments:
Post a Comment