మాయాలోకం
అది మరో ప్రపంచం
భూగ్రహానికి దూరంగా
అంతరిక్షంలో ఎక్కడో విసిరేసినట్లున్న
అందమైన ప్రపంచం
కొత్తలోకంలోకి అడుగుపెట్టాను
కాళ్ళకు నేల తగులుతోంది
మన భూమిలాగానే
ఎదురుగా ఒక అందమైన జలాశయం
పచ్చని తోటలు
విచ్చుకున్న మారాకులు
అలా తలతిప్పిచూస్తే
ఎండిపోయిన చెట్లూ చెలమలు
మట్టి దిబ్బలూ
కంకర రాళ్ళూ
అది ఒక వాడిన వసంతం
జలాశయాన్ని వదిలేసి
వాడిన వసంతంవైపే అడుగు కదిపాను
కంకర రాళ్ళను దాటి
చిన్న నీటి చెలమను చేరా
మనసారా దప్పిక తీర్చుకున్నా
వెనక్కి తరిగి చూస్తే
ఆ జలాశయం కానరాలేదు
అది ఒక ఎండమావి
అలా ముందుకు నడిచాను
ఎదురుగా ఒక మేక కనిపించింది
జాగ్రత్తగా తప్పించుకున్నా
నాకు తెలుసు అది మేక కాదు పులియని
నేను నడిచే బాటలో
అందమైన పూల తివాచి
రకరకాల పువ్వులు
సుగంధపరిమళాలు
ఆ బాటలో నడవలేదు నేను
నాకు తెలుసు
ఆ పువ్వుల మాటున ముళ్ళున్నాయని
సేద తీరాలని చూసాను
ఎదురుగా అందమైన భవనం
పక్కనే పాడుబడ్డ పూరిల్లు
శిథిల గుడిసెలోకి వెళ్లి నడుం వాల్చా
నాకు తెలుసు ఆ భవనంలో
ప్రశాంతత లేదని
కళ్ళు మూతబడే వేళలో
ఎదురుగా ఓ ఆకారం
మంద్రంగా పలకరించింది
మాలోకంలోకి వచ్చిన నీవు
వింతగా ప్రవర్తిస్తున్నావు
జలాశయాన్ని కాదన్నావు
మేకను చూసి భయపడ్డావు
పూలబాట వద్దనుకున్నావు
భవంతిని వీడి గుడిసె నీడన చేరావు
ఏమిటి నీ మర్మమని
అప్పుడు బదులిచ్చాను చిరునవ్వుతో
నాలోకమున బతికిన అనుభవం
నన్నిలా మార్చిందని
భూలోకమనే మాయాలోకమున ఉన్న వింతలు
ఈ లోకమున ఉన్నాయా అని
కుట్రలు
దగాలు
మేకవన్నె పులులు
మాయమాటలు
దొంగ నాటకాలు
వీటన్నింటి ముందు
మీలోకమెంత
మీ మాయాజాలామెంత
నా బదులు నచ్చిందో లేదో తెలియదు
ఆ ఆకారం మాయమయ్యింది
నాకూ మెలకువ వచ్చింది
మనస్వినీ
మనస్వినీ
No comments:
Post a Comment