అక్షరాల అలజడి
ఎందుకు రాయను
రాస్తూనే ఉంటా
అర్థం చేసుకునే వారు చేసుకుంటారు
చేతకాని వారు విమర్శిస్తారు
విమర్శలకు జంకను
పొగడ్తలకు పొంగిపోను
మనసులో ఉన్నదే రాసుకుంటా
మనసు చెప్పిందే రాస్తా
ఎవరు నిర్దేశించగలరు నా రాతల్ని
ఎవరు ఆపగలరు నా భావాలని
గులాబీ పువ్వు తంగేడుపువ్వు రెండూ ఒకటేనా
తంగేడుపై ఎందుకు రాయవు
గులాబీపైనే ఎందుకు రాస్తావంటే
ఏమని చెప్పను
గులాబీయంటే నాకిష్టం
దాని పరిమళం నాకిష్టం
గులాబీ సోయగాలను ఆస్వాదిస్తా
భావాలుగా రాసుకుంటా
గులాబీ ముళ్ళు గుచ్చుకుంటే
వేదనతో అలమటిస్తా
కన్నీటితో అక్షరాలను తడుపుకుంటా
అలా ఎందుకు రాసావని నిలదీస్తే
ఏమని చెప్పను
నా మనసు సొదలుకాక
వేరే ఎలా రాసుకుంటా
పులకించిన భావాలు
విలపించిన అక్షరాలు నా కవితలు
అర్థం చేసుకున్నవారికి
అర్థం చేసుకున్నంత
ఎలాంటి ఘడియలోనూ
ఆగవు నా అక్షరాలు
అవి వికసిస్తూనే ఉంటాయి
రుధిరంలో తడుస్తాయి
పరిమళంలో పులకిస్తాయి
కన్నీరుగా రాలిపడతాయి
అవేశంలో చెలరేగుతాయి
అక్షరాల అలజడిని ఆపతరమా
ఎవరికైనా
No comments:
Post a Comment