అన్నీ తెలిసిన మనసే...?
నా మనసుని అడిగాను
దేవుడంటే ఎవరని
ఎలా ఉంటాడని
ఎక్కడ ఉంటాడని...
మనసు వినమ్రంగా చెప్పింది
దేవుడు నీలోనే ఉన్నాడని
నీలాగే ఉంటాడనీ
నువ్వే దేవుడివని...
మనసు మాటే నమ్మా
నేనే దేవుడినని అనుకున్నా
దేవుడిలాగే వ్యవహరించా
దేవుడినే అనుకున్నా...
సమాజానికి నచ్చలేదు
నేనే దేవుడినని నమ్మలేదు
బోనులో నిలిపింది సమాజం
ముద్దాయిగా మార్చింది సమాజం...
విచారణ మొదలయ్యింది
అంతులేని ఆరోపణలతో
అర్థంకాని వాదనలతో
నిలదీసింది సమాజం...
ఆరోపణలకు బెదరలేదు నేను
వాదనలకు జంకలేదు నేను
నేనే నిజమని వాదించా
సమాజం ముందు ఓడిపోయా
శిక్ష వేసింది సమాజం
నన్ను రాళ్ళతో కొట్టి చంపమని...
మైదానంలో నిలబెట్టారు నన్ను
అందరూ ఏదేదో అంటున్నారు
మోసగాడినని ఒకరు
ద్రోహి అని మరొకరు
తోచినవిధంగా తిడుతున్నారు
అన్నీ వింటున్నా
చిరునవ్వుతో సమాధానం ఇస్తున్నా...
రాళ్ళ వాన మొదలయ్యింది
సూటిగా విసురుతున్న కంకరరాళ్ళు
దేహాన్ని ఛిద్రం చేస్తున్నాయి
రుధిరం కారుతోంది
ఆశ్చర్యం
కన్నీరు రాలటం లేదు
దేహానికి గాయాలు అవుతున్నా
రక్తం నేలను ముద్దాడుతున్నా
నాలో వేదన లేదు
చింతన లేదు
మనసారా నవ్వుకుంటున్నా నేను...
నేను దేవుడిని
నేను మార్గదర్శిని
సర్వం నేనే
అమాయకజనానికేం తెలుసు
నవ్వుతూనే ఉన్నా నేను...
విసురుగా వచ్చి తగులుతున్న రాళ్ళ మధ్యలో
ఒక పువ్వు కనిపించింది
అంతే వేగంగా నా గుండెను తాకింది
ఛిద్రమైపోయింది నా గుండె
ముక్కలైపోయింది నా దేహం
నేనేమిటో నాకు చెప్పి
అన్నీ తెలిసిన మనసే ఆ పువ్వును విసిరితే
అది నాకు రాయిలా తగలదా
మనస్వినీ...
No comments:
Post a Comment