నేస్తమై దిగివస్తా
ఒళ్ళు విరుచుకుని
ఆకృతిని సవరించుకునే
కరి మబ్బుల సోయగాలను చూడు
మబ్బుల పెదాలను దాటి
కాంతులీనే మెరుపులను చూడు
నేనే కనిపిస్తా
నా చిరునవ్వులే కనిపిస్తాయి
నీ ముంగురులను సవరిస్తూ
ఆర్తిగా పెనవేసుకునే
పిల్లగాలులను పలకరించి చూడు
నీ అణువణువునా
అనుభూతి మొలకలు వేస్తా
మేఘమాలికలను అల్లరిపెడుతున్న
నిండు జాబిల్లిని చూడు
అమృతవర్షమై కురుస్తా
భారమైన మనస్సులా
గుంభనమైన కడలిపై నర్తించే కెరటాలను
చూడు
ఎగిసిపడే మనసునై పలకరిస్తా
అప్పుడే వికసించి నవ్వుతున్న
పువ్వును చూడు
నీ పెదాల చిరునవ్వునై రాలిపడతా
దప్పికతీర్చే ఆశలపల్లకి
ఎండమావిని తడిమి చూడు
అందమైన స్వప్నమై కరిగిపోతా
ఒంటరితనంతో కబుర్లు చెబుతూ
మనసునిండా కనులుమూసుకో
ఊసులు చెప్పే నేస్తమై దిగివస్తా
నేడున్న నేను
రేపు లేకున్నా
నీతో ఎప్పుడూ ఉంటా
మనస్వినీ
No comments:
Post a Comment