అమ్మతో నేను
చందమామ కథలు
చదువుతున్న అనుభూతి
కాశీ మజిలీ కథల్లో
కలిసిపోయిన అనుభవం
అరేబియన్ నైట్స్ లో
నసీరుద్దీన్ ను కలిసిన భావం
అదేదో కొత్తలోకంలో
విహరించిన వైనం
అవును
అమ్మతో నేను
ఎన్నెన్నో ముచ్చట్లు
మరపురాని సుద్దులు
ఎనిమిది పదుల
ముదిమిలోనూ
అలనాటి జ్ఞాపకాలను
మరిచిపోని అమ్మ
ఒక్కొక్కటిగా
నెమరువేసుకుంటూ
విడమర్చి నాకు
చెబుతుంటే
చిన్న పిల్లాడిలా నేను
ఆ లోకంలో విహరిస్తూ
ఉంటే
ఒక్కసారిగా నా బాల్యం
మరలా పలకరిస్తోంది
నాడు వాళ్ళ ఊరు
ఊరిలోని జనం
బంధువులు
స్నేహితులు
ఒక్కొక్కరిది ఒక్కో
గాథ
పులిని కాల్చి చంపిన
మా తాత
గేదె అనుకుని పులిని
కట్టేసిన ఒక మగువ
దయ్యాల కథలు
అప్పటి కష్టాలు
కన్నీళ్ళూ
ఒక్కటేమిటి
అమ్మ మాటల్లో
జీవితాలన్నీ సినిమా
రీళ్లలా తిరుగుతూనే ఉన్నాయి
అమ్మ జీవితాన్నీ
తన బాల్యాన్నీ
కనులారా చూసిన అనుభూతి
మిగిలింది
అన్నీ నమ్మాలని
అనుకున్నా
నమ్మలేకపోయినా
బోసినవ్వుల అమ్మ
చెప్పిందంటే
నమ్మితీరాల్సిందే
అమ్మ మాటలు వింటున్న
నేను
నా బాల్యాన్ని మరోమారు
అనుభవిస్తున్నా
మనస్వినీ
No comments:
Post a Comment