మీకెలా తెలుసు
మైనం ముద్ద నా మనసు
ఎవరికి తోచిన ఆకృతి
వారికి దొరికింది
ఒకరు పొడవుగా
సాగదీస్తే
ఇంకొకరు చిన్న వలయంలా
మార్చారు
ఒకరు అందమైన బొమ్మగా
మలిస్తే
ఇంకొకరు వికృతమైన
రాక్షసుడిగా చూపారు
తమ తమ మనసులు చెప్పిన
విధంగా
మైనం బొమ్మలు చేశారు
నీలాకాశంలో తేలియాడే
మబ్బుతునకను నేను
ఒక్కో కన్నుకు ఒక్కోలా
కనిపించాను
ఒకరికి సింహంలా
కనిపిస్తే
మరొకరికి పులిలా
కనిపించాను
ఇంకొకరికి కుక్కలా
కొందరికి నక్కలా
చాలామందికి
కరిగిపోతున్న స్వప్నంలా
ఎవరికి తోచిన విధంగా
వారు చూశారు
మైనం రాయిలా
మారిపోయింది
మబ్బుతునక
కరిగిపోయింది
నేనూ నా మనసు
నా అంతరంగం పరులకెలా
తెలుసో
ఎవరికి వారు చెప్పుకుంటున్నారు
నేను ఏమిటని
నా మనసులో ఏముందో
నాకుగాక
సమాజానికెలా తెలుసు
మనస్వినీ
No comments:
Post a Comment