బ్రెయిన్ ఫార్మాట్
పయనం ఎక్కడ
మొదలయ్యిందో
తెలియనే తెలియదు...
గమ్యం ఎక్కడో
తెలియదు...
అడుగులు పడుతూనే
ఉంటాయి...
జాడలు చెదిరిపోతూనే
ఉంటాయి...
ఎక్కడలేని మనో ధైర్యం
...
ప్రతి మలుపూ
ఆనందమయం...
ఆలోచనలకు అంతం లేదు...
అంతరంగంలో
విషాదమే లేదు...
చీకూ చింతా లేదు...
బాదరబందీ లేనేలేదు...
అయినవారెవరో
కానివారెవరో
తెలియనే తెలియదు...
మనసుకు నచ్చిందే
తనది...
అనుకున్నదే మాట
ఆడుకున్నదే ఆట...
ఏమయినా అనుకోవచ్చు
ఏదయినా చేయవచ్చు...
సమాజం ఒక గడ్డిపోచ...
పెదాలపై నిత్యం
నవ్వులే...
గొంతులో జాలువారేది
పాటలే...
ఇలాంటి జీవితం
ఎక్కడైనా ఉందా...
ఇలాంటి వారు
కనిపిస్తారా ఎక్కడైనా...
ఉన్నారు ఎందరో
వీధి వీధిలో
మరెందరో...
సమాజం పిచ్చి ముద్ర
వేసింది...
నిజానికి జీవితమంటే
వారిదే...
సమస్యలు లేవు
సుడిగుండాలు లేవు...
బాధ్యతలు లేవు
సమరాలు లేవు...
ఆకలి తీరితే చాలు
నిత్యం ఆనందమే...
ఆ జీవనం ఆనందమయం...
దేవుడు మెదడును
ఒక చిప్ గా చేస్తే
ఆ చిప్ ఫార్మాట్
అయ్యింది...
గజిబిజి మస్తిష్కం
అల్లకల్లోల మానసం...
నరాలు తెగే ఉత్కంఠత
ఈ అయోమయం
గందరగోళం నుంచి
ఉపశమనం కావాలనుకునే
వారు
తమ బ్రెయిన్ ను
ఫార్మాట్ చేయాలని
దేవుడిని కోరుకోవటం
సహజమే కదా
మనస్వినీ...
No comments:
Post a Comment