నాన్న కూడా ఏడుస్తాడు
నాన్నా ఏమయ్యింది
నాన్నా
ఎందుకు నాన్నా
దిగాలుగా ఉన్నావ్ ...
అలిసిపోయావా నాన్నా
ఒక్కసారి నవ్వు
నాన్నా...
నువ్వలా ఉంటే నాకు
బాధగా ఉంది
నీ నవ్వే మాకు ఎనర్జీ
నాన్నా...
గుండెలపై తల ఆనించిన
గారాలపట్టికి ఆ తండ్రి
ఏమని బదులిస్తాడు...
తనగుండెలోని వేదనను
చదివి
కన్నీటి సుడుల
మౌనాన్ని గ్రహించి
చిరునవ్వుల పువ్వులు
పూయించాలని
చిట్టి తల్లి పడుతున్న
తపనకు
ఆ నాన్న ఎలా
స్పందిస్తాడు...
ఎలా చెప్పగలడు ఆ
తండ్రి తనకూ మనసుందని
తన కళ్ళలో కన్నీరే
ఉంటాయని...
ఎవరికి తెలుసు తండ్రి
మనసు
ఎవరు చదివారు ఆ మూగ
భాష...
సమస్యల సమరంలో ఓటమి
అంచున జారి
తను పడుతున్న తపన ఏ
గుండెకు తెలుసు...
రెండు ముద్దల అన్నం
తక్కువ తింటే
తనవారి కడుపైనా
నిండుతుందని ఆరాటపడే
ఆ మనసు ఆకలిని
చంపుకున్న రోజులు ఎవరికి తెలుసు...
కారులో వెళుతూనో
బైక్ పై దూసుకుపోతూనో
సైకిల్ మీద ప్రయాణం
చేస్తూనో
ఆ తండ్రి ఆలోచించేది
పిల్లల కోసమే...
అర్ధంకాని అయోమయంలో
ఏ చెట్టు కిందనో
బ్రిడ్జి పక్కనో ఆగి
ఒంటరిగా ఏడ్చే
ఆ మనిషికీ కన్నీళ్ళే
వస్తాయి...
పిల్లల భవిశ్యత్తు
చదువుల ఖర్చులు
ఆ సామాన్య తండ్రికి
అగ్ని పరీక్షలే ...
కక్ష కట్టిన సమాజంతో
సమరం చేస్తూ...
ఇంటిపోరులో సమిధగా
మారుతూ
కుంగిపోతున్న ఆ
అభాగ్యుడి మనసులోనూ
ఆవేదనే రగులుతుంది...
అన్నీ ఉన్నప్పుడు
దేవుడిలా కొలిచి
ఏమీ లేదనగానే దయ్యంలా
చూసే
తనవారి మధ్యనే ఉన్నా
అతను నిత్యం ఒంటరే...
తన పిల్లల కోసం ఏమీ
చేసుకోలేక
తనకంటూ ఏమీ లేక
అందరున్నా ఎవరూ లేక
రగిలిపోతూ
కుంగిపోతూ
సతమతమయ్యే ఆ మనిషిలో
కరిగిపోతున్న కలలను
ఎవరు చూడగలిగారు...
ఎలా చెప్పగలడు ఆ
తండ్రి
తన చిట్టి తల్లికి
ప్రతి తండ్రీ తాను
కొవ్వొత్తిలా కరిగిపోతూ
పిల్లలకు
వెలుగునిస్తాడని...
జీవన సమరంలో
తానోడి తనవారి
గెలుపుకోసం
సమిధగా మారే
నాన్నలందరికీ సలాం
మనస్వినీ...
No comments:
Post a Comment