కలగానే ఉండిపో...
పాలరాతి
శిల్పానికి నగిషీలు చెక్కి
తెల్లమబ్బు
అందాలను చీరగా చుట్టి
జాబిలమ్మ వెన్నెలను బుగ్గలపై కెంపులుగా అద్ది
గులాబీ బాల
మెరుపులను పెదాలపై దిద్ది
నీలి నింగి
రంగులను కన్నులలో పొదిగి
కడలి కెరటాలను
ఎదపొంగులలో దాచి
ఎంత తీరికగా
మలిచాడు నీ బొమ్మని ఆ దేవుడు...
నీ అందచందాలను ఆస్వాదించాలని నాకు లేదు
ఆ అపురూపాలను
ఆరాధించాలని ఉంది...
నీ కనురెప్పల మాటున దాగాలని నాకు లేదు
నా కన్నుల
నిండా నిన్ను నింపుకోవాలని ఉంది...
నీ గులాబీ రేకుల పెదాలపై నా పేరే నర్తించాలని నాకు లేదు
నా
చిరునవ్వులతో నిన్ను ఒడిసిపట్టుకోవాలని ఉంది...
ఆ కడలి పొంగులతో ఆదుకోవాలని నాకు లేదు
నా గుండె
గుడిలో నిన్ను దాచుకోవాలని ఉంది...
నా ఊహల వేదికపై నిత్యం నర్తించే నీకు
వాస్తవంలో
ఉనికే లేదని నాకు తెలుసు...
నువ్వే లేని నువ్వు నన్నెలా ప్రేమిస్తావు
ఉనికే లేని
నువ్వు నా ఉనికిని ఎలా గుర్తిస్తావు ...
నా భావనా ప్రపంచంలో నువ్వెప్పుడూ ఉన్నావు
నా ప్రతి
ఆలోచనలో నువ్వున్నావు...
ఊహా సుందరివి నువ్వు
కలల తోటలో
మారాకువి నువ్వు...
ఎప్పటికీ
నన్ను చేరని మనస్సువి నువ్వు
నా హృదిలో
కొలువైన మనస్వినివి నువ్వు...
నువ్వు లేవని
తెలుసు
ఎప్పటికీ మన
కలయిక లేదని తెలుసు ...
అయినా నీ
అందాలను ఆరాధిస్తా
అంతరంగంలో
నిన్నే చూసుకుంటా...
ఈ నీఛ సమాజంలో
నువ్వు నిజమై రావద్దు
ఒక అందమైన
ఊహాగా
నా మనసులోనే ఉండిపో
మనస్వినీ...
No comments:
Post a Comment