ఓసి మనసా నువ్వే మనసా?
ఎలా
మరుస్తుంది మనసు
మోడువారిన
తనపై
మమతల లేపనం
అద్దిన మనసును
మనసెలా
మరుస్తుంది...
ఆకలి
దాచుకున్న తనకు
గోరుముద్దలు
తినిపించి
అమ్మలోని
కమ్మదనాన్ని
పంచి పెట్టిన
మనసును
ఎలా
మరుస్తుంది మనసు...
పసిపాపగా
మారిన తనకు
నలుగు స్నానం
చేయించిన
అమృతధారను
ఎలా
మరుస్తుంది మనసు ...
నిశి ఆటల్లో
బిడియాలను విసిరేసి
అలౌకిక
ఆనందాన్ని అందించిన
రసమయిని
ఎలా
మరుస్తుంది మనసు...
తను వేదన
పడితే
అది తన వేదనగా
కన్నీటిని
దోసిట పట్టిన
త్యాగమయిని
ఎలా
మరుస్తుంది మనసు...
ఆ మనసులోని
రెండవ కోణం
మొదటి
కోణాన్ని మింగేస్తే
ఎలా
తట్టుకుంటుంది మనసు...
మమతల లేపనం
ఆరిపోయి
అవమానపు
ముళ్ళు మొలిస్తే
మనసుగానే
ఉంటుందా మనసు
ఓసి మనసా
నువ్వే మనసా...?
No comments:
Post a Comment