గాయపడుతున్న అక్షరం
నీ కన్నుల
వెన్నెలలో ఆడుకున్నాయి నా అక్షరాలు
నీ పెదాల
మెరుపులను తమ ఒంటికి అద్దుకున్నాయి నా అక్షరాలు
నీ మాటల
మతలబులో స్నానమాడాయి నా అక్షరాలు
నీ మనసులో
మాధుర్యానికి భాష్యం పలికాయి నా అక్షరాలు
నీ కంటిపాప
వెలుతురులో కాగడాలుగా నిలిచాయి నా అక్షరాలు
నీ చూపు పడితే
చాలు పులకరించాయి నా అక్షరాలు
ఎంతమనసైన
భావమని నువ్వంటే నింగిని గెలిచాయి నా అక్షరాలు
ప్రతి నిత్యం
నీ స్పర్శకు తహతహలాడాయి నా అక్షరాలు
ఇప్పుడూ నా
అక్షరాలను తాకుతున్నావు
అక్షర
గుండియలను తడుముతున్నావు
ప్రతి
అక్షరంలో ఇప్పుడు నీకు కొత్త అర్థమే దొరుకుతోంది
ప్రతిభావంలో
నీకు విపరీతమే కనిపిస్తోంది
పువ్వులాంటి
అక్షరంపై ఈటెల మాటలను సంధిస్తూ
అక్షర సమరం
చేస్తున్నావు
పనికిరానివారితో
పనేమిటని
యూజ్ లెస్
బిరుదాంకితం చేసావు
నాడున్నది
నేడు ఏది మాయమయ్యింది నా అక్షరంలో
ఓసి సమాజమా
చూడకు నా
అక్షరాన్ని
నీ చూపుల
కరకుదనంలో అక్షరపుష్పాల
గాయాలు మళ్ళీ
నిద్దుర లేస్తున్నాయి
No comments:
Post a Comment