నీ నగరిలో అనామకుడిని
ఆకాశమంతటి నీ
మనసులో
విహంగమై
విహరించాను...
నీ కన్నుల వెన్నెలలో
జాబిలినై వెలిగాను...
నీ పెదాల
మధురిమలో
మెరుపుతీగనై
మెరిసాను...
విధి ఆడిన
చదరంగంలో
అందరున్నా
ఒంటరినయ్యాను...
నీ మనసులో విహంగమైన
నేను
నీ నగరిలో
అనామకుడినయ్యాను...
నీ వీధిలో నా కన్నులు
నిత్యం నిన్నే
శోధిస్తున్నాయి...
నీవు నడియాడే
వీధిలో
నాకళ్ళు ఎండమావులవుతున్నాయి
...
ఎదురుగా
వస్తావా
పక్క వీధిలో
ఉన్నావా
ఎండిపోయిన
నయనాలు
ఆర్తిగా
చూస్తున్నాయి...
నేను రోజూ నడిచిన
మార్గమే
ఎందుకలా
అయ్యావని నన్ను ప్రశ్నిస్తోంది...
నిత్యం నన్ను
పలకరించిన వీధే
నన్ను చూసి
చిన్నబోతోంది ...
నీ ఇంట్లో
వెలుగుతున్న దీపం
నీ వెన్నెల
ఏదని వెక్కిరిస్తోంది...
మన కలయిక
లేదని తెలుసు
అది ఇక
కలయేనని తెలుసు...
తనది అనే లోకం
వీడి
పరాయి ప్రపంచం
పంచన చేరిన మనసు
ఎన్నటికీ
మనసును చేరదు...
నా మనసుకూ
తెలుసు
ఇక మనసు లేదనీ
అది తిరిగి
రాదనీ...
అయినా నీ
నగరిలో
దారితప్పిన
బాటసారిలా
నా అడుగులు పడుతూనే
ఉంటాయి...
నువ్వు చూడవనీ
చూసినా చూపు
తిప్పుకుంటావనీ
నా మనసుకు
తెలుసు...
నువ్వు తిరిగి
రాకున్నా
నీ రూపం
కనిపిస్తే చాలు
ఎండమావులైన నా
కన్నులు
కన్నీటి
చెలమలుగా మారిపోతాయి...
No comments:
Post a Comment