జాడలు లేని అడుగులు
అడుగు తీసి
అడుగు వేసాను
ప్రతి అడుగూ
ఆలోచించి వేసాను...
వెనకకు మరలి
ప్రతి
అడుగుజాడనూ సరిచూసుకున్నాను...
ప్రతి జాడలో
పువ్వులు విరబూసాయి
గుచ్చుకునే
ముళ్ళూ మొలకలు వేసాయి...
ఒక్కో అడుగూ
జాగ్రత్తగా మలుచుకున్నాను
ప్రతి అడుగులో
ఒక్కో మెట్టు అధిగమించాను...
జీవన బాటలో
స్వాగతం పలికిన గులాబీలను గాంచాను...
గుచ్చుకునే
ముళ్ళనూ దాటాను...
గులాబీలకు
పొంగిపోలేదు
పువ్వులను
ముద్దాడలేదు
పువ్వులను
చిదిమేయలేదు
ప్రతిపువ్వుకూ
నేపథ్యముంది...
ప్రతి మలుపులో
అభిమానం దొరికింది
అభిమానం
స్నేహమై విరిసింది...
చుట్టూ
పూబాలలు ముసిరినా
మనసైన
పువ్వుకోసమే తపించాను...
ముళ్ళను
ఏరివేసి
పువ్వులను
దాటేసి
జాడలను
విసిరేసి
ముందుకే
నడిచాను...
మనసును
మురిపించే పువ్వుకోసం
అడుగుజాడలనే మరిచిపోయాను...
ఇప్పుడు వెనక్కి
తిరిగి చూస్తే
ధూళిలో
కరిగిపోయిన జాడలు
కనుమరుగై
వెక్కిరిస్తున్నాయి...
No comments:
Post a Comment