డైరీలో తెల్ల పేజీలు
గతించిన కాలం
తాను
వెళ్ళిపోతూ
జ్ఞాపకాలను
నాపై విసిరేస్తే ...
ఒక్కసారి
గతంలోకి
వెళ్లాలనీ
నాటి
స్మృతులను ఒక్కసారి
తడుముకోవాలనీ
నా అనుభవాల
డైరీ విప్పిచూసా...
డైరీలో ప్రతి
పేజీని తిప్పాలని
ఆరాటపడ్డా...
ఆశ్చర్యం
వందలపేజీలు
ఖాళీగా
కనిపించాయి...
మళ్ళీ మళ్ళీ
తిప్పి చూసా
తెల్ల
కాగితాలు నవ్వుతూ వెక్కిరించాయి..
ఏమైపోయాయి
నేను
చెక్కుకున్న అక్షరాలు...
ఎలా
మాయమయ్యాయి
నేను
దాచుకున్న అనుభవాలు...
మకరందం
తాగేసిన సీతాకోకచిలుకల్లా
నా అనుభాల
అక్షరాలు ఎగిరిపోయాయా...
ఎందుకు శూన్యం
నన్ను
వెక్కిరిస్తోంది...
ఎందుకు వాడిపోయాయి
నేను పదిలంగా
దాచుకున్న
జ్ఞాపకాల
పుష్పాలు ...
నేను
రాసుకున్న అక్షరాల్లో లోపమా
నేను వాడిన
కలం ఒక శిలాజమా ...
డైరీలో
అక్షరాలు మాయం కావచ్చు
తెల్లకాగితాలు
దయ్యాల్లా బెదిరించవచ్చు...
ఆ డైరీ ఒక
శూన్యపుస్తకమే కావచ్చు
కాలగమనంలో అది
శిథిలమే కావచ్చు...
గుండె గుడి
గోడలపై
రాసుకున్న
రుధిరాక్షరాలు
నా అనుభవాల
పరంపరలై
నిత్యం నన్ను
ముద్దాడవా...
నా రుధిరంలో
కణాలుగా మారిన
అనుభవాలను
చెరిపేసే దమ్ము
ఎవరికైనా
ఉందా...
No comments:
Post a Comment