చిరునవ్వుల వరమిస్తావా
నింగి జాబిల్లి నేలకు
జారినట్లు
కోటి విద్యుత్ లతలు
నేలపై ప్రసరించినట్లు
తలుపు తెరుచుకోగానే
మది తలపులనుంచి
జాలువారే నీ
చిరునవ్వుల
తరంగాలు
నా హృదయవీణలో
స్వాగతరాగాలు పలికిస్తాయి...
మానసకడలిలో
ఎగసిపడే బాధాతప్త కెరటాలు
చిరునవ్వుల పరిమళానికి
ముడుచుకుపోతాయి ...
నీ పెదాల చిరునవ్వుల
కమలాలు...
నీ కన్నుల వెన్నెల
కిరణాలు
మనసుకు అత్తర్లు
పూస్తాయి...
దైనందిక జీవన పోరాటంలో
ఓటమి అంచున నిలిచిన
నాకు
నీ కంటిపాపల చల్లదనంలో
విజయతీరాలే
కనిపిస్తాయి...
నీ ముఖారవిందమే
ముభావమైతే
రచ్చ గెలిచినా నేను
జీవన సమరంలో ఓడినట్లే ...
ప్రాణవాయువు చిరునవ్వు
మాయమైతే
ఊపిరే భారం నాకు...
నీ కన్నుల్లో వెన్నెలే
లేకపోతే
జగమంతా చీకటే నాకు...
కోటి రతనాల రాశులు
అపారమైన సిరిసంపదలు
అన్నింటికన్నా
వికసించే ముఖారవిందమే
ఇష్టం నాకు...
కాలం ఏదైనా
కసికాలమే ఎదుట
నిలిచినా
తెరుచుకున్న ఇంటి
తలుపులో
నవ్వులపువ్వులు రువ్వే
చందమామ
సాక్షాత్కారం కావాలి
నాకు...
నిత్యం అనునిత్యం
నీ చిరునవ్వుల
వరమిస్తావా
మనస్వినీ...
No comments:
Post a Comment