జాడలు మరువకు మనసా
ఓసి పిచ్చి
మనసా
మనసైన మనసా
...
అన్నీ తెలుసని
అమాయకంగా నమ్మే
అందమైన
మనసా....
ఈత నేర్చిన
చేపవే నీవు
మిలమిల మెరిసే
అందమైన మీనానివే నీవు ...
మొప్పల
ఆయుధంతో
అలల తరంగాలను
ఎగసిపడే
కెరటాలను
చుట్టుముట్టే
సుడిగుండాలనూ
తేలికగానే
దాటగలవు నీవు
విశాల కడలిని
జయించగలవు నీవు...
ఓసి మనసా
అందమైన
మానసకవనం నీవు
రెక్కల
సహాయంతో
నీటిలో ఈదే
చేపలా
నీలినింగిపై
ఒక చిరుఅలలా
ఎగిరేపక్షివే
నీవు ...
నీలి నింగి
వికసించినా
కారుమబ్బులు
కమ్ముకున్నా
ఆకాశవీధిలో
విజేతవే నీవు...
ఓసి మనసా
కడలిలో
కమ్ముకునే కెరటాలే కాదు
రాకాసి నోరు
తిమింగలాలూ ఎదురవుతాయి
ఆకాశదేశాన
అందమైన పక్షులే కాదు
రాబందులూ
విహరిస్తాయి...
సునామీలు
సముద్రాన్ని నేలమీదకు విసిరేస్తే
నేలమీద
సుడిగాలులు ఆకాశాన్ని కమ్ముకుంటాయి...
మీనమా మొప్పలు
కదిలించేముందు
నీటి
సుడులమాటున ఏముందో చూడు ...
విహంగమా
రెక్కలు విప్పే ముందు
నీలినింగిని
తేరిపారా చూడు ...
మనసా
అందమైన లోకమే
ప్రతి అడుగులో
రంగులే
రంగుల
తెరలవెనుక నలుపు రంగును చూడు...
అడుగులో అడుగు
వేసే ముందు
జాడలు
చెదిరిపోకుండా
పదిలంగా
ముందుకు అడుగులు వేయ్
మనసా...
No comments:
Post a Comment