తప్పులెన్ను వారు
తప్పు చేసిన
మనసే తప్పులెన్నుతున్నది
విడిచివెళ్లిన
చెయ్యే శాపనార్ధాలు పెడుతున్నది...
వాదనలో తనను
ఎవరూ నెగ్గలేరని అంటున్నది
తాను పట్టిన
కుందేలుకు మూడు కాళ్ళేనంటున్నది...
అర్థం లేని
వాదనతో రాద్ధాంతం చేస్తున్నది
పసలేని మాటలతో
గోడలకు ఎక్కుతున్నది...
ప్రేమ పేరుతో
హుండీలు వద్దని సలహాలు నేర్పుతున్నది
తొలి కలయికలో సంపదల
ఊసే లేదన్నది మరిచిపోయినట్టున్నది...
ఉన్నదంతా
కరిగిపోయినా
సిరిసంపదలే
దాచుకున్నావని అనుమానం పడుతున్నది ...
తప్పులెన్నువారు
తమ తప్పులెరుగరు
వేమన మాటను
మరోమారు నిజం చేయుచున్నది ...
మనసు బాటలో
మనసుకు పట్టిన గతిని
మనసు
గుర్తించననే అంటున్నది...
మనువు
గురుతును విసిరేసిన తానే
వదిలిపోయావేమని
నిలదీస్తున్నది...
నన్ను కాదని
మరొకరితో సుఖమని నిష్ఠూరాలాడుతున్నది
పరిమితులన్నీ
ముందే తెలిసినా మరిచిపోయినట్టే ఉన్నది...
మనసు మౌనంగానే
ఓటమికి తలవంచినా
అక్షర సమరమే
ఆపలేకున్నది...
మనసు మనసుకు
చేసిన మోసం ఆ మనసుకే తెలుసని
మరో మనసు
మిన్నకుండిపోయినది...
No comments:
Post a Comment