మనసా ఐ లవ్ యూ
ఆకాశం నుంచి
రంగులు దోచుకున్నట్లు
మిలమిల మెరిసే
ఆ నయనాలు
గుడ్డి
దీపాలుగా మారిపోతాయి...
తీయని
మధురసాలు చిందించే ఆధరాలు
మెరుపులను
కోల్పోయి పెళుసుబారిపోతాయి...
మేఘమాలికలను తలపిస్తూ
మమతల నీడలను
కురిపించే కురులు
ఒక్కొక్కటిగా
రాలిపోతూ ఆనవాళ్ళుగానే మిగిలిపోతాయి...
కడలిపొంగులను
ఓడించే
ఆ ఎదపొంగులు జారిపోయి
గతకాలపు
వైభవానికి శిథిలాలుగా మారిపోతాయి...
వంపులు తిరగిన
నడుము
పటుత్వమే లేని
భవనంలా కూలిపోతుంది...
గులాబీ రంగుల
మెరుపుల వీణ దేహం
తన లాలిత్యం
నశించి
బీడువారిన
నేలను తలపిస్తుంది...
మయూర నడకల
నెరజాణ
నడకలే తెలియని
పసికందు అవుతుంది...
మృదు
మధురస్వరంతో
మత్తెక్కించిన
గొంతుకలో
తడబడే పలుకులే
వినిపిస్తాయి...
పరువమంతా కరిగిపోతుంది
లాలిత్యం పండుటాకులా
రాలిపోతుంది...
పిచ్చి మనసా
అందచందాల సమాహారం
కాదు బంధనం...
ముప్పది పరువంలో ఉన్న నీవు
అరవైలో
పలకరించినా అంతే పులకిస్తుంది నా మనసు...
వసంతం వాడక తప్పదని తెలుసు
వసంత రుతువు
మధురిమలు ఇక దక్కవనీ తెలుసు
అయినా
ఎదురుచూస్తూనే ఉంటుంది నా మనసు
ఆ చల్లని
పలకరింపుకోసం...
బోసినవ్వుల ముదిమిలోనూ
నా మనసు చెబుతుంది
ఐ లవ్ యూ
మనస్వినీ...
No comments:
Post a Comment