తేరీ
బిందియా మేరే నామ్
నీ బిందియా
రంగులో మెరుపును నేనే కావాలి
చందమామ మోముపై
అది నా సంకేతం కావాలి ...
నున్నని మెడపై
సుతారంగా కదలాడే
ఆ నల్లని హారం
నేనే కావాలి...
చిగురుటాకులా
వణికే పెదాలపై
తళుకులు చిందే
గులాబీ రంగులో నేనే కనిపించాలి...
తీయని గొంతులో
జాలువారే పలుకుల్లో
నేను మాత్రమే
ఉండాలి...
ఆ చెవుల్లో మంద్రంగా వినిపించే సంగీతంలో
నా రాగమే
వినిపించాలి...
ఆ కనుల కొలనులో
నేనే వెన్నెల
స్నానం చేయాలి...
ఆ కురులమేఘాల్లో
నేనే
సేదతీరాలి...
కడలి కెరటాలను కవ్వించే
ఆ ఎద పొంగులలో
నేనే తల
దాచుకోవాలి ...
ఆ మువ్వల సవ్వడి
పాదాల అలజడి
నా ఎదలోనే
ప్రకంపనలు రేపాలి...
ఆ మయూర నర్తన భంగిమలు
నాకే అంకితం
కావాలి...
ఒకటేమిటి సర్వమూ
నాకే కావాలి...
ఆ హృదయమందిరంలో
వెలిగే దీపం
నేనే కావాలి...
ఎంత స్వార్ధపూరితం
నా మానసం...
అన్నీ నావేనంటున్నది
నాకే సొంతమని
వాదిస్తున్నది...
నా మనసు నాకే సొంతమని
ఆరాటపడుతున్నది...
ఇది స్వార్ధమేనంటావా
మనస్వినీ...
No comments:
Post a Comment