దేవుడు తీసిన సినిమా
అంతా మన
చేతిలోనే ఉన్నట్టు కనిపిస్తుంది
మనం ఏదైనా
చేసిపారేస్తాం అనిపిస్తుంది...
మన కదలికను
మనమే శాసిస్తున్నామని అనిపిస్తుంది
ఎదుటివారిని
మొత్తం చదివేసామనిపిస్తుంది...
జీవన సమరంలో
మన గెలుపే కనిపిస్తుంది
కుట్రలు
కుతంత్రాలు దాటేస్తామని అనిపిస్తుంది
మాయా మర్మాలు
మనల్ని తాకలేవనిపిస్తుంది...
పరుల పలుకులు తీయగా
హితుల మాటలు
చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది...
మనవారు
పరాయివారేననీ
పరులంతా
మనవారేనని అనిపిస్తుంది...
చీకటి తొలిగి
వెలుతురు పొడవగానే
విజయతీరాలకు
పరుగుతీయాలనిపిస్తుంది...
పరాజయం మనకు
లేదు
విజయమే
మనదనిపిస్తుంది...
అంతా మన కంటి
చూపుతోనే
జరిగిపోతుందని
అనిపిస్తుంది...
అంతా జరిగాక
తెలిసిపోతుంది
ఏదీ మన చేతిలో
లేదని...
అప్పుడు
తెలుస్తుంది నిజం
మన స్క్రీన్
ప్లే ఎవరో రాసిపడేసారని...
మన చుట్టూ
మనతో ఉన్నవారే
పాత్రధారులని...
ఎవరికి ఎవరు
కాకున్నా
అంతా
నటిస్తున్నారని...
కనులముందు
భ్రమల తెరలు తొలిగాక
ఇది మన జీవితం
కాదు
దేవుడు తీస్తున్న
సినిమా అని తెలిసిపోతుంది...
మనం హీరోలమైనా
జీరోలమైనా
ఆ దర్శకుడి పాత్రలమేనన్న
నిజం ముందుకు వస్తుంది...
సినిమా
నడుస్తూనే ఉంటుంది
మన పాత్ర మాత్రం
ముగిసిపోతుంది...
దేవుడు
తీస్తున్న సినిమాలో
మన కథ కంచికి
చేరుతుంది...
ఓ మైగాడ్
దేవుడు తీసే
సినిమా
నిజమనే
అనుకుంటున్నాం...
No comments:
Post a Comment