పులి సాదు జంతువే
మాంసం లేనిదే
పొట్ట నిండని పులి సాదు జంతువే
అడవిలోనున్న
పులి పిల్లను పెంచుకుని చూడు
గడ్డి పరకలు తింటూ
పిల్లిలా నీ వెంట తిరుగుతుంది
తల నిండా
విషమున్న కాలనాగులోనూ విషయముంది
తన విషంలోనే
విరుగుడు దాచి నీకు ప్రాణం పోస్తుంది
ఆలోచనే లేని
పులి భయంతోనే దాడి చేస్తుంది
కాలనాగునైనా
కదిలిస్తేనే బుస కొడుతుంది
క్రూరంగా
కనిపించే పులులూ సింహాలు
పంజా విసిరినా
అది ప్రకృతి ధర్మం
కోడె నాగు పడగ
విప్పినా
అది దాని
అణువణువునా నిండి ఉన్న భయం
మరి మనిషి
ఆధునిక కాల
చక్రానికి దర్పణం
సంఘజీవనానికి
నిదర్శనం
మనిషికి మెదడు
నిండా ఆలోచనలున్నా
మంచీ చెడూ
జ్ఞానమున్నా
మనసు నిండా
విషమే
పాము భయంతో
కాటు వేస్తే
మనషి
స్వార్ధంతో కాటు వేస్తున్నాడు
కప్పను మింగిన
పాము కడుపు నిండిందని నిదురిస్తే
అన్నీ ఉన్నా
ఇంకా కావాలని మనిషి కాటు వేస్తున్నాడు
ప్రేమలో విషం
కురిసే మమతల
వర్షంలో విషం
ఆలుమగల
అనురాగంలో విషం
అన్నదమ్ముల
అనుబంధంలో విషం
స్నేహమనే
ముసుగు విషం
ఆదుకుంటామని
ముందుకు వచ్చే మనిషిలో విషం
నడకలో విషం
నడతలో విషం
మూగజీవులు ఇతర
జాతులపై దాడి చేస్తే
ఆధునిక మనిషి
ఆది మానవుడై
సొంత జాతిపైనే
చిమ్ముతున్నాడు విషం
మరి ఎవరు క్రూర
జంతువు
ఆ మూగ జీవాలా
అన్నీ ఉన్నా
ఆశ చావని
మనిషా
నిజమే కదూ
పాము మనకు
మంచి నేస్తమే
పులి సాదు జంతువే
No comments:
Post a Comment