ఆ పాటలు గుచ్చుకుంటున్నాయి
నీ పెదాల
కదలికలకు ఒక గానమై
నా గళం
జాలువారింది...
నా పల్లవికి పాటై
నీ దరహాసం
చిందేసింది...
మంద్రమైన గానంలో
ఆణువణువూ
పులకించింది ...
స్టీరియోలో గీతం
ప్రతినిత్యం
అందమైన పయనమే...
తీయగా జాలువారుతున్న సంగీతంలో
రెండు హృదయాలూ
యుగళ గీతాలు
అల్లుకున్నాయి...
ప్రతిపాటలో తామై
తామే ఆ పాటై
మనసులు రెండూ జతగూడాయి...
మనసు ముభావమై
సమయం భారమై
రెండు హృదయాల
సంఘర్షణలో
పదనిసల పూలు
కురిపించినది
అందమైన ఆ
పాటలే...
నువ్వూ నేనూ కలిసి పాడుకున్న ఆ గీతాలు
ఇంకా
మెదులుతూనే ఉన్నాయి నాలో...
ఇప్పుడూ పెదాలు కదలాడుతున్నాయి
ఆ పాటలు
మాత్రం వినిపించటం లేదు...
మనసు పాడుతున్న మూగగానం
గొంతు దాటి
రావటం లేదు...
అదే నేను అదే నీవు
అదే మాట అదే
బాట
మనసైన రాగమే
లేదు...
ప్రతిపాటా మెదులుతోంది నాలో
ప్రతిరాగం
ఉబుకుతోంది నాలో...
అప్పుడూ ఇప్పుడూ
కనిపించే తేడా
ఒక్కటే...
నాడు ఆ గీతాలు మమతల పువ్వులు విరబూస్తే
ఇప్పుడు ఆ
పాటలే గుచ్చుకుంటున్నాయి
మనస్వినీ...
No comments:
Post a Comment