పెన్సిల్ గీతలు కాదు నా జ్ఞాపకాలు
వాడి పడేసిన
వస్తువులు కాదు నా జ్ఞాపకాలు
వాడిపోయిన
పువ్వులు కాదు విసిరేయటానికి...
మనసు పొరలో
అనుభూతులు నా జ్ఞాపకాలు
గుండె గుడిలో
వెలిగే దీపాలు నా జ్ఞాపకాలు...
నడిచిన బాటలో
అవి
అడుగుజాడలు ...
దేహాన్ని
నడిపే ఊపిరిలో
నులివెచ్చని
శ్వాసే నా జ్ఞాపకాలు ...
చందమామ మోముపై
మిల మిల
మెరిసే బిందియా తళుకులు నా జ్ఞాపకాలు...
ఎంత వద్దని
వారించినా
చెమర్చిన
కళ్ళలో జారిపడే నీటి బిందువులే నా జ్ఞాపకాలు...
మంద్రమైన సంగీతంలో
కురిసే భావాలే
నా జ్ఞాపకాలు...
గడపదాటి
అడుగుపెడితే
అడుగును
ముద్దాడే కీచురాళ్ళే నా జ్ఞాపకాలు ...
సమాధిలో ఎలా
ఇమిడిపోతాయి జ్ఞాపకాలు
మనోసంద్రంలో
ఎగసిపడే కెరటాలే నా జ్ఞాపకాలు...
అర్థంలేని
ఆవేశంలో రాటుదేలాయి నా జ్ఞాపకాలు
గోడను తాకిన
బంతిలా ముద్దాడుతాయి నా జ్ఞాపకాలు...
పెన్సిల్ తో
రాసుకున్న పిచ్చి గీతలు కాదు
రబ్బరుతో
తుడిచిపారేయటానికి
రుధిరంలో
తడిసిన రక్తాక్షరాలు నా జ్ఞాపకాలు...
నా జ్ఞాపకాలను
తుడిచేసే
ఎరేజర్ ఇంకా పుట్టలేదు
మనస్వినీ...
No comments:
Post a Comment