కన్నుల్లో సునామీ
కనురెప్పల
వాకిలిలో
సన్నని తెరలలో
బంధీగా అలమటిస్తూ
ఓదార్పుకోసం
ఆర్తిగా వేచిచూస్తున్న
ఓ కన్నీటి
చుక్క కిందకు జారింది...
కనుల కొలను
నుంచి జాలువారుతూ
చెంపను తాకిన
నీటి సుడులలో
మునుపటి
పులకింత కానరాలేదు
నాటి ఆనందం
భాష్పంగా రాలలేదు...
కనుల చెరసాలనుంచి
విడుదలైన
మోదమూ కానరాలేదు...
బరువెక్కిన ఆ
కన్నీటి చుక్క
ఆ కనులను
అడిగింది
ఇంతకాలం
నన్నెందుకు దాచుకున్నావని...
ఇష్ట సఖి
గుండెపై నన్నెందుకు
తడియారనీయలేదని...
ఇరుదేహాల
పరిష్వంగమంలో
దరిచేరిన
హృదయాలలో
పరిమళాల
పూవులు పూయనే లేదు...
యాంత్రికంగా
సాగిన స్పందనలు
రెండు
గుండెలకూ వినిపించాయి...
ఆ గుండెల
సవ్వడిలో పరవశం కానరాలేదు
ఆ స్పందనలూ
ఆగిపోలేదు...
భారమైన గుండె
వెక్కి వెక్కి విలపించింది
నన్నెందుకు
దూరం చేసుకున్నావని..
.
.
మాటే లేని
మౌనగీతంలో మునిగిన
రెండు హృదయాలు
విడివడుతూ
మరలా ఎప్పుడు ఆత్మీయ
స్పర్శ అనుకుంటూ
మౌనంగానే
ఉండిపోయాయి...
తన వశంలో ఏమీ
లేదని రోదించిన మనసులో
చెలరేగిన
ఉప్పెన
కన్నీటి
ధారలుగా జాలువారుతూ
వెచ్చని
ఓదార్పు పలికింది...
కన్నీటి ధారల
వానలో
నా మనసు
నిత్యం స్నానమాడుతూనే ఉంది
కంటిపొరల
సునామీలో
నా మనసు
మునుగుతూనే ఉంది
మనస్వినీ...
No comments:
Post a Comment