పప్పా ఏక్ డౌట్...?
ఆకాశం నీలి
రంగులోనే ఎందుకుంటుంది?
మబ్బులు
కిందికి ఎందుకు జారి పడవు ?
మబ్బులు తమలో
నీళ్ళు ఎలా దాచుకుంటాయి?
కోతినుండే
మనిషి వస్తే
మిగతా కోతులు
మనుషులుగా ఎందుకు మారలేదు?
సూర్యగోళం
మండుతూ ఉంటుంది కదా
మరి అది
ఎందుకు కాలిపోదు ?
అమావాస్య
రాత్రి చంద్రుడు ఎక్కడ దాక్కుంటాడు?
భూమి
గుండ్రంగా ఉంటే
మనం ఎందుకు
జారి పడము?
గాలి ఎందుకు
కనిపించదు?
నీళ్ళకు రంగు
ఎందుకు లేదు?
ఆడవారిని ఆమె
మగవారిని అతడు అంటాం
మరి మగ జంతువును
అతడు అని ఎందుకు పిలవం?
కోడి పుంజు
వచ్చింది అని ఎందుకంటాం?
ఈ ప్రశ్నల్లో
కొన్ని సిల్లీగా అనిపించినా
మరికొన్నింటికి
జవాబే లేదు...
ముభావంగా ఉన్న
వేళ
నా గారాల
పట్టి
నా పై సంధించే
ప్రశ్నలివి...
పప్పా నాకొక
డౌట్ అంటూ
సంధించే సందేహాలకు
సమాధానం
తెలియక
మనసారా నవ్వటం
మినహా ఏం చెయ్యగలను...
మరీ అంత
అమాయకురాలు కాదు
నా
బంగారుతల్లి
అయినా
వేస్తుంది అవే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ...
జీవన సమరంలో
అలసిపోయి
మనసు పొరలో
నిశి రాజ్యమేలే వేళ
చిట్టి తల్లి
సందేహాలు
వెన్నెలే
కురిపించవా...
తను
కోరుకునేదీ అదేనని తెలుసు
అందుకే
నవ్వుకుంటా మనసారా
మనస్వినీ....
No comments:
Post a Comment