తిరస్కరిస్తున్నా నీ న్యాయాన్ని...
అభిమానం నుంచి మొదలైన
ప్రస్థానాన్ని
అవమానం వైపు నడిపావు
తలెత్తి నిలిచిన
శిఖరాన్ని
నేలకూల్చావు...
నేను చేసిన నేరం ఏమిటి
నేను చేసిన పాపం ఏమిటి...
సూటిగా సమాధానం చెప్పు
నిజంగా దేవుడివే
అయితే...
తడుముకోకుండా నిజం
చెప్పు
ధర్మానికే నీవు
మూర్తివైతే...
ఎందుకు నాకు తలవంపులు
ఎందుకు ఈ తీరని వేదనలు...
సమాజానికి రాజును
కావాలని కోరుకున్నానా
జగతిని శాసించే
శక్తిని కావాలని ఆరాటపడ్డానా...
అడిగానా ఎవరి సంపదనైనా
కోరుకున్నానా ఎవరి
ఆస్తులైనా...
నేల కూలిన నేను
లేచి నిలబడాలని కోరడమే
తప్పా...
నాలో లేని ఆశలు
నేను కోరనే కోరని
కానుకలు
మనసును తాకితే
ఆశపడటం స్వార్ధమా...
లేని భ్రమలవైపు కాసింత
వంగిన మనసు
నిజమేనేమో
లేచినిలబడతానేమోనని
ఊహల్లో విహరించటం నా
తప్పా...
మరి ఎందుకు నాకు మనసు
ఇచ్చావు
మనసులో ఎందుకు
స్పందనలు నింపావు...
నీ బార్గాహ్ లో
తలవంచిన నేను
ఎప్పుడైనా కోరానా
సిరిసంపదలను...
గడ్డిపోచను ఆధారంగా
ఇవ్వు చాలని అడిగానే
మరి గడ్డిపోచపైనే పిడుగులు
ఎందుకు...
నిన్ను ఏమీ కోరకున్నా
నీ మార్గమునే నమ్మానే
పాపభీతితోనే బతికానే
ఎవరి కొంపలూ ముంచలేదే
మరి ఎందుకు అన్నింటికీ
నన్నే బాద్యుడిని
చేసావు...
మనిషిగా పుట్టించి
రాక్షసుడిగా ఎందుకు
మారుస్తావు
నేను మారటమే నీ
అభిమతమా
నువ్వు రాసిన రాతల
సారాంశం ఇదేనా...
ఇప్పటికీ నిన్నే
నమ్మాలా
నిన్నే పూజించాలా
నీ రాతలనే
ఆచరించాలా...
నేను తప్పు చేయలేదు
నీ మార్గం వీడలేదు
ఇప్పుడు
తిరస్కరిస్తున్నా
నీ న్యాయాన్ని
ధిక్కరిస్తున్నా నీ
ధర్మాన్ని...
నా మార్పు దేవుడితోనే మొదలుపెడుతున్నా
మనస్వినీ..
No comments:
Post a Comment