తలవంచని స్వప్నం
గగన వీధిలో హాయిగా విహరించే
తెల్లని పక్షిని
చూస్తే
మనసు పులకిస్తుంది
మబ్బులను తాకుతుందా
అని
భ్రమలు గొలుపుతూ
పల్టీలు కొడుతూ
ఎన్నెన్ని విన్యాసాలు
కనురెప్పల వీధిలో
విహరించే నా స్వప్నాల్లా
తన కలల సాకారానికి
నింగిని జయించిన పక్షి
ఇంకా పైపైకి
దూసుకుపోతూనే ఉంది
నాకనుల బంధీగా మారిన
కలలను వెక్కిరిస్తూ...
నిశబ్ధాన్ని ఛేదిస్తూ
హోరును రగిలిస్తూ
ఎగసిపడే కడలి కెరటాలను
చూస్తే
అలుపెరుగని పోరాటమే
కనిపిస్తుంది
నేలను తాకుతూ
పొగరుగా తల ఎగురవేస్తూ
పడిలేచే కెరటాలు
వికట్టహాసం చేస్తూనే
ఉన్నాయి
నా మనసులో భావకెరటాలకు
సవాల్ విసురుతూ...
రివ్వున ఎగసే
పక్షిరాజం
నింగిని గెలుస్తుందా
ఎగసిపడే పొగరు కెరటం
పుడమిని జయిస్తుందా
జ్వలించే నా భావం
ప్రకృతికి తలవంచునా
మనస్వినీ...
No comments:
Post a Comment