జీవనరాగాలు
ఆకాశంలో తారకలను
దోసిటపట్టి
నీ కురులలో మల్లెలుగా
కూర్చలేను
నీలినింగి జాబిల్లిని
నీ నుదుటన దిద్దలేను
మబ్బుతునకను దోచి
తెచ్చి
నీ ఒంటికి చీరగా
చుట్టలేను
ఇంద్రధనుస్సు ను చోరీ
చేసి
నీకు కానుకగా ఇవ్వలేను
కురిసే చల్లని
వెన్నెలను
నీ దేహానికి గంధంగా
పూయలేను
మనసున్న మనిషినే నేను
నేల విడిచి సాము
చేయలేను
భావకుడనే నేను
భావాలనే పువ్వులుగా
విరిసే పువ్వులనే
నవ్వులుగా
అక్షరాలను రాసుకుంటా
నీతో జీవించే జీవితంలో
ప్రతి ఘడియా జీవిస్తా
జీవితాన్నే రాసుకుంటా
అక్షరాలతో విన్యాసాలు
చేయను
భావాలతో ప్రయోగాలు
చేయను
ఆకాశానికి నిచ్చెనలు
వెయ్యను
నీటి మీద రాతలు రాయను
మనసునే కాగితంగా
మలుచుకుని
రుధిరాన్నే సిరాగా
నింపుకుని
మనసులో ఉన్నదే
రాసుకుంటా
నీతో పంచుకునే ఘడియలను
భావాలుగా
మధురక్షణాలను
అక్షరాలుగా
నవ్వులను మనసు పాటలుగా
కన్నీళ్లను చరణాలుగా
నిత్యం రాసుకుంటా
రాస్తూనే ఉంటా
నా భావాలు నా జీవనరాగాలు
మనస్వినీ
No comments:
Post a Comment