దండయాత్ర
కాదు ఇది
గడియారం ముల్లు
జారవిడిచిన
సమయం కాదది
గడిచిన జ్ఞాపకమై
కరిగిపోవటానికి...
అలా వచ్చి ఇలా
పలకరించి
మాయమయ్యే ఘడియ కాదది
మనసు ఫలకంలో
మాసిపోవడానికి...
ఉప్పునీటి చెలమలో
దాహార్తి కాదది
తడారిన గొంతు
తడుపుకోడానికి...
ప్లాస్టిక్ పువ్వులో
పరిమళం కాదది
వాసనేదో మరిచిపోవడానికి...
ఆవేశంలో పొగలుచిమ్మే
దండయాత్ర కాదది
ఏకపక్ష విజయం
అనుభవించటానికి...
మనసుతోట పువ్వుల
పరపరాగ సంపర్కమది...
ఒకరికి ఒకరుగా
ప్రాణానికి ప్రాణంగా
పెనవేసుకునే దేహాల
ఆత్మీయ ఆలింగనమది...
వేడి నిట్టూర్పుల
ఆవిరిలో
కరిగిపోతున్న
స్వేదబిందువును చూడు
ఎంత తృప్తిగా
అంతమవుతోందో...
కనురెప్పలపరదాల మాటున
జారిపడే
కన్నీటి చుక్కను అడుగు
ఎంత ఆనందంగా
మరణిస్తున్నదో...
కరుగుతున్న స్వేదం
మరణిస్తున్న ఆనందభాష్పం
ఇవికాదా ఆత్మీయ
స్పర్శకు ఆనవాళ్ళు...
అనుభూతి కరిగి
భావమే రగిలి
మనసు ముభావమైన
తనువుల సంగమం
జారిపోయే స్వప్నానికి
సంకేతమే కదా
మనస్వినీ...
No comments:
Post a Comment