మనసులోనే పదిలమేమో
కవితలు
వాణిజ్యప్రకటనలుగా
భావాలు పదాల
జిమ్మిక్కులుగా
అక్షరాలు ప్రదర్శన శాలలుగా
అక్షర విన్యాసాలు
చేస్తూ
పదాలతో సర్కస్ ఫీట్లను
మరిపిస్తూ
ఎందుకు ఇంత ఆరాటం
అర్థమే లేని
అక్షరపోరాటం
నిజమేనేమో
భావమాలికలన్నీ గాలి
కబుర్లేనేమో
మనసు భావాలను మనసులో
దాచుకోక
ఒద్దికైన అక్షరాలను
కూర్చడం
ఎవ్వరికోసమో
మనసైన మనసును తాకని
భావాలు
అక్షర పుష్పాలై పది
మందిని అలరిస్తే
రాసుకున్న భావాలన్నీ
వాసనే లేని ప్లాస్టిక్
పువ్వులేనేమో
ఫిరదౌసులూ
కాళిదాసులూ
కృష్ణ శాస్త్రి కవితలూ
బహాదూర్ షా రాతలూ
పదిమందిని కదిలించినా
అవి వికసించని
పుష్పాలేనేమో
మనసులో భావానికి అక్షర
రూపం ఎందుకో
నిజమేనేమో
భావాలు మనసులోనే పదిలమేమో
మనస్వినీ
No comments:
Post a Comment