ఐస్ క్రీం మొక్కలు
పెరటి తోటలో ఐస్ క్రీం
మొక్కలు నాటుకుంటే
తోపుడుబండి డబ్బావాడి
దగ్గర
పైసలు పోసి ఐస్ క్రీం కొనాల్సిన
పనే లేదు
జామ దానిమ్మల తోటల్లా
పిజ్జా బర్గర్ లు కాసే
చెట్లను పెంచుకుంటే
విదేశీ ఫాస్ట్ ఫుడ్
సెంటర్ లకు
పరుగులు తీసే పనే
ఉండదు
మట్టి కుండీలలో పూల
మొక్కలు కాదు
గులాబ్ జామూన్ పూసే
చిట్టి మొక్కలు
పెంచుకుంటే
ప్రతి సాయంత్రం పైసా
ఖర్చు లేకుండా
డజన్లకొద్దీ జామూన్లు
చప్పరించవచ్చు
వింతగా అనిపించినా
ఎంత అద్భుతం ఈ భావం
సాధ్యమే కాదని
తెలిసినా
ఎంత తీయగా ఉందీ ఆలోచన
నా గారాలపట్టి
ముద్దుల తనయ
సరదాగా పలికే
పలుకులివి
నేనే సైంటిస్ట్ నయితే
ఐస్ క్రీం మొక్కలు
బర్గర్లు కాసే చెట్లు
జామూన్ కుండీలు
అద్భుతాల మొక్కల కోసం
పరిశోధనలు చేస్తానని
అందరిని నవ్వించే తన
మాటల్లో
సరదా పువ్వులు
దొరలుతున్నా
నాకెందుకో బాగా
నచ్చింది
తన భావం
ఏదైనా సాధ్యమేననిపించే
ఈ లోకంలో
గారాలపట్టి పలుకులూ
నిజమవుతాయేమో
మనస్వినీ...
No comments:
Post a Comment