శేష ప్రశ్న
ఆకాశం మబ్బులు
పట్టి ఉంది
ముభావమైన
మనసులా
వాతావరణం
చల్లగానే ఉంది
వానముసురుకు సంకేతంగా...
అలవాటు
మార్చుకోలేని పిల్లగాలులు
అల్లరి
చేస్తూనే ఉన్నాయి
పట్టపగ్గాలే
లేనట్లుగా...
చినుకుల
పలకరింతకు పచ్చని ఆకులు
మరింత
విచ్చుకుంటున్నాయి
అప్పుడే
స్నానం చేసినట్లుగా...
దేహానికి
అంటుతున్న పిల్లగాలులు
మనసును
తాకలేకపోతున్నాయెందుకో...
ఆహ్లాదపు
పవనంలో
చెమటలు పడుతున్నాయెందుకో...
మౌనమైన నేను
మౌనంగానే
మనసును అడిగాను
ఏమయ్యిందని
మౌనమే
సమాధానమైనా
మనసు బాధగా
మూలుగుతోంది ఎందుకో...
ఏ ముల్లూ
గుచ్చలేదు
ఏ బాణమూ గాయం
చేయలేదు
అయినా మానసం
ఉద్రిక్తభరితం ఎందుకో...
భావం తెలియని
ముభావంలో
మౌనం శేష
ప్రశ్నగానే మిగిలిపోయింది
మనస్వినీ...
No comments:
Post a Comment