నేను మారుతున్నా...
నాడున్న నేను నేడు
లేను
నేడున్న నేను నాడు
లేను
నిజమే నేను మారుతున్నా
మెల్ల మెల్లగా...
కొలిమిలో మండిన ఇనుప
ఆకృతిలా
కడలిపోటుకు
నునుపుదేలిన బండరాయిలా
నగిషీలు దిద్దిన
బంగారంలా
మారుతూనే ఉన్నా
మెల్ల మెల్లగా...
నాటి మఖ్ మల్ భావాలు
కరకుదేలుతున్నాయి
నాడు పెనవేసిన భావాలు
విడివడుతున్నాయి
తెలియని ఆలోచనలు ఏవో
రాతి పువ్వులై
మొలుస్తున్నాయి
అందుకే నేను
మారుతున్నా
మెల్ల మెల్లగా...
అంతా నేనే అనుకున్నా
అంతా నిజమే అనుకున్నా
అందరూ నావారే
అనుకున్నా
నిజం వెనుక తెలియని
అబద్దమేదో
పొంచి ఉందని
తెలియకున్నా
మర్మం తెలిసి నిజం
గ్రహించి
మార్పు దిశగా
నడుస్తున్నా
అవును
నేను మారుతున్నా
మెల్ల మెల్లగా...
స్నేహమనే విషనాగులను గిరాటు
వేసా
బంధువుల కపటప్రేమలకు
సమాధి కట్టా
తీయని పలుకుల మాటున
చేదునే
ఆస్వాదిస్తున్నా
సహకారం వెనుక దాగిన
మతలబునూ చూస్తున్నా
ఇప్పుడు నా చుట్టూ
నేనే కంచెను కట్టుకున్నా
మారుతున్నా
మెల్ల మెల్లగా...
వయసుకు మించిన అనుభవం
నా స్వంతం చేసుకున్నా
దరి చేరిన అనుభవంలో
పాఠాలు నేర్చుకున్నా
ప్రతి మలుపునూ
గుణపాఠమని నమ్ముతున్నా
అందుకే మారుతున్నా
మెల్ల మెల్లగా...
నువ్వూ నేను
ఇంకా మనం తప్ప
మిగిలిన లోకం మనది
కానే కాదని తెలుసుకున్నా
మనకోసమే మనం
మనకోసం ఎవరూ కాదని
తెలిసి
మారుతున్నా
మెల్ల మెల్లగా
మనస్వినీ...
No comments:
Post a Comment