అడ్రస్
గల్లంతయ్యింది...
శోధన దిశగా అడుగులు
వేసాను
పరిశోధన లక్ష్యంగా నడక
సాగించాను
తనెక్కడో వెతకాలని
తన చిరునామా
తెలుసుకోవాలనీ...
నేను నడిచే బాటలో
ఒకరిని చూసాను
నుదుటన తిలకం
తేజస్సు నిండిన
ముఖారవిందం
ఎవరు నీవని అడిగాను
మూర్ఖుడా ఇదికూడా
తెలియదా
నేను హిందూవుని అని
గర్జించాడు
నిజమేననుకుని చల్లగా
జారుకున్నాను
అక్కడి నుంచి...
ఆకుపచ్చ రంగులో
మెరుస్తున్న
ఓ పెద్దాయనను పలకరించా
ఎవరు స్వామీ నీవు
అని...
కళ్ళు కనిపించటం లేదా
నీకు
నేను ముసల్మాన్ అని
రుసరుసలాడాడు
బాబోయ్ అంటూ పరుగులు
తీసా...
ఎదురుగా ఓ దివ్యమూర్తి
తెల్లని వస్త్రాలతో
ధగదగా మెరిసిపోతున్నాడు
చేతులు జోడించి అడిగా
మీరెవరు ప్రభూ అని...
బిడ్డా నన్ను గుర్తు
పట్టలేదా
నేను దేవుని బిడ్డను
రా కుమారా అంటూ
చాచిన చేతుల్లోనుంచి
తప్పించుకున్నా...
పరుగులాంటి నడకే
పయనమయ్యింది
అలసిన అడుగులకు
సాంత్వన కోసం
కొంచెం ఆగాను...
అక్కడేదో విద్యాలయమని
అనుకుంటా
నూనుగు మీసాల
కుర్రాళ్ళకు పాఠాలు
చెబుతున్నాడు ఓ పెద్దాయన
సర్వమానవాళిలో తమదే
గొప్ప జాతియని
తమపురాణాలే
శాసనాలనీ...
కొద్ది దూరం నడిస్తే
అతిపెద్ద మదర్సా
విశ్వంలో విశ్వాసులకు
ప్రతినిధులం మనమే
గొప్పమీద గొప్ప
చెప్పుకుంటున్నారు...
ఓ ప్రాంగణంలో శిలువ
వారికి మాత్రమే విలువ
ప్రపంచాన్ని శాసించే
దేవుని బిడ్డలం
బోధనలు చెవికి
నచ్చలేదేమో
ముందుకే నడిచాను..
నా శోధన మాత్రం ఆగలేదు
నడుస్తూనే ఉన్నా
తన కోసమే
వెతుకుతున్నా...
ఎక్కడ చూసినా
హిందూవులు ముస్లింలు
క్రైస్తవులు లేదా
సిక్కులు
మనిషి మాత్రం దొరకలేదు
మనస్వినీ...
No comments:
Post a Comment