మనసుముద్రికలు
ఎవరికీ అంతుచిక్కని నా
అంతరంగాన్ని
తడిమిచూసుకోవానిపించింది...
ఆరోపణల జడిలో
తడుస్తున్న నా మనసును
సమీక్షించాలనిపించింది...
అంతర్మథనంనుంచి
పుట్టిన ఆలోచన
మనసు పుస్తకాన్ని
తట్టిలేపింది...
ముభావంగానే మనసు రచనల
పేజీలను
తిరగవేసాను...
నేను రాసుకున్న
అక్షరాలను
నిజాయితీగా తాకి
చూసాను
మనసుపై కమ్ముకున్న
ముభావం
పరదా జారిపోయింది...
గూడుకట్టుకున్న
నిర్లిప్తత
మంచులా కరిగిపోయింది...
ఒక్కో భావాన్నీ
తడిమాను
ఒక్కో అక్షరాన్నీ
నిద్రలేపాను
ఒక అక్షరం కన్నీటి
పుష్పమై
కనురెప్పలను చుంబిస్తే
ఒక భావం చీకటిలో చిరు
దీపమై
కన్నులలో మెరుపులు
నింపింది...
మారుతున్న పేజీలతోపాటు
కొత్త రెక్కలు
విప్పుకుంటున్న భావాలు...
ఒక భావం పువ్వులా
పలకరిస్తే
మరో భావం నేస్తమై తోడు
వస్తానని అంది...
ఒక భావం మకరందమై
పెదాలను తాకితే
మరో భావం కత్తిలా
గుండెకు గుచ్చుకుంది...
ప్రతి అక్షరంలో
శోధించాను
ప్రతిభావంలో కాగడాలు
పెట్టి వెతికాను
మతలబేదైనా దాగి
ఉందేమోనని
కపటమేదైనా
మిగిలిఉందేమోనని
భేషజాలేమైనా
పొంచిఉన్నాయేమోనని...
ఒక అక్షరం అలిగింది
మరో అక్షరం గుండెలు
పగిలేలా ఏడ్చింది
నీ మనసు ముద్రికలమైన
మమ్ములనే
అనుమానిస్తావా అని...
జారిపడుతున్న
కన్నీళ్ళలో
అక్షరాలు
కరిగిపోకముందే
మనసు పుస్తకం మూసివేసా
మనస్వినీ...
No comments:
Post a Comment