మారదు మరణిస్తుంది
ముభావమై కనిపించే
ఆ మనసు మారిందా
కలత చెంది కలవరం పొంది
భావరహితమైన మనసు
మారిందని
ఎలా నిర్ణయించగలరు
ఎవరు చూసారు ఆ
మనసులోని మార్పుని
ఎలా కొలవగలిగారు
అంతరంగాన్ని
ఎవరు తడిమి చూసారు
మనసు లోతుల్ని
ఎలా
చెప్పగలుగుతున్నారు
ఆ పిచ్చి మనసు
మారిందని
ముభావంగా కనిపిస్తే
అది మార్పా
కనులముందు కనిపించే
వైఫల్యం మార్పా
ఎలాంటి సవ్వడి
చేయకుండా
మౌనంగా రోధించే మనసు
జారవిడిచిన
కన్నీటి చుక్కలే
మార్పుకు సంకేతమా
విధివంచనకు గురై
తనలో తానే కుమిలిపోతే
అది మనసులో మార్పా
ఆ మనసుకు బాధ ఉండదా
ఆ మనసుకు వేదన ఉండదా
మనసులో భావోద్వేగాలకు
తావే లేదా
రక్తమాంసాల హృదయంలో
రాతి శిలలే
కనిపిస్తున్నాయా
అభిమానం నుంచి అవమానం
దాకా
ప్రస్థానం చేసిన
మగవాడి మనసు అది
నపుంసకుడి కంటే ఘోరంగా
అలమటించే దయనీయ
హృదయమది
అమృత ఘడియల అన్వేషణలో
విషపు చుక్కలను తాగే
వెర్రి మనసది
యస్... మనసుకు అహం
అడ్డు వస్తోంది
తాను విసిరేసిన
గడ్డిపోచనే ఆసరాగా మలుచుకునే
విషయం బయటికి
చెప్పుకునేందుకు
అహం అడ్డు వస్తోంది
అయినవారే ఆ గడ్డిపోచకు
నిప్పు పెడుతున్న వైనం
చెప్పుకునేందుకు అహం
అడ్డు వస్తోంది
మారలేదు మనసు
విలపిస్తోంది ఆ మనసు
మనీ కాదు ఆ మనసుకు
ఇంధనం
భావోద్వేగాల సమాహారమే
ఆ మానసం
మనీకోసమే మనసు సమరమైతే
కూడబెట్టిన కోట్లు
ఎక్కడ
దాచుకున్న సిరిసంపదల
విలువ ఎంత
భవిత అంధాకారమై
రేపన్నది శూన్యమై
కాలం సర్పమై పడగ
విప్పితే
భయంతో వణికిపోతోంది
మనసు
అయినా ప్రేమ పయనంలో
అడుగులు వేస్తూనే ఉంది
మనసు
భయపడుతోంది
కలవరపడుతోంది
ఏడుస్తోంది
లేచినిలబడాలని
పరితపిస్తోంది
అల్లకల్లోల నావలా
సాగుతున్నా
మనసైన మనసుకోసం
స్పందిస్తూనే ఉంది
మనసు
ఆ మనసు మారదు
అవసరమైతే మరణిస్తుంది
మనస్వినీ
No comments:
Post a Comment