చీకటి పుష్పం
చల్లని గాలి సైతం
ముల్లులా గుచ్చుకునే
వేళ
చిరుజల్లుల సవ్వడి
సైతం
జడివానై బెదిరించే వేళ
చందమామ వెన్నెల సైతం
సూర్య రశ్మిని తలపించే
వేళ
అల్లకల్లోల మానసం
సునామీలు పొంగించే వేళ
గజిబిజి భావాలను
నిద్దురపుచ్చి
మౌనమనే చీకటిలోయలోకి
జారిపోతాను నేను...
నల్లని చీకటి పరదాల
నీడన
సేదతీరటం నాకు
మామూలే...
కళ్ళు చెదిరే వెలుగు
రేఖలు అక్కడ లేవు
గుండెను పిండి చేసే
పిడుగులూ కానరావు
చల్లని వెన్నెల లేదు
మంటలు రేపే సూరీడూ
లేడు
విశాలమైన నల్లని లోయ
అది
అంతే లేని అగాధమది...
ఆది ఎక్కడో అంతం ఏమిటో
తెలియని
చీకటి లోకంలో
నన్ను నేను మచ్చిక
చేసుకోవడం
నా కెంతో ఇష్టం...
మౌనమనే లోయలో
చివుర్లు తొడిగిన
చీకటి పుష్పమే నేను
మనస్వినీ...
No comments:
Post a Comment