నిర్జీవదేహం
ఎందుకో నాగురించి నేను
తెలుసుకోవాలని
అనుకుంటున్నా
నన్ను నేనే ఒకసారి
సమీక్షించుకోవాలని
అనుకున్నా
ఆలోచనలన్నీ
నావైపే తిప్పుకున్నా
అంతరంగంలో
నన్ను నేనే
నింపుకున్నా
ఎవరిని నేను
ఎక్కడ ఉదయించాను
ఎక్కడ అస్తమిస్తాను
నా పయనం ఎక్కడ
నా అంతం ఎక్కడ...
నింగినుంచి నేలకు
రాలుతున్న తారకనా
పుడమిని చేరకనే
వాయుమండలంలో
ధూళీగా మిగిలిపోయానే
నేలపై ఏమీ దొరకలేదు
మట్టి తప్ప...
మబ్బులనుంచి జారిపడిన
వాన చినుకునా
దోసిటపట్టలేకపోయానే
భూమిపై చూస్తే ఏముంది
బురదనీరు తప్ప...
ఎద కనుమలలో వికసించిన
స్వప్నమా నేను
రెప్పలమాటున దాచుకోలేక
పోయానే
కనులు తెరిస్తే ఏముంది
వెక్కిరించే శూన్యం
తప్ప...
నేనున్నానని భ్రమించే
లేనేలేని నేను
నన్నే ఎలా
సమీక్షించుకోను
శూన్యంతో కనులు కలపడం
తప్ప...
నాగురించి నేను ఏమని
రాసుకోను
కన్నీటిలో తడిచిన
అక్షరాలు
నీటి రాతలుగా
కొట్టుకుపోతూ ఉంటే
నిష్క్రియుడనై చూస్తూ
ఉండటం తప్ప...
నీ నుంచి నన్ను వేరు
చేసి సమీక్షిస్తే
నేనెక్కడ ఉంటాను
నిర్జీవదేహం తప్ప...
నాగురించి
రాసుకుందామని మొదలుపెట్టే
ప్రతి అక్షరం అందుకే
నీవైపు
పరుగులు తీస్తోందేమో
మనస్వినీ...
No comments:
Post a Comment