విశ్వమంతా నేనే
ఎక్కడో ఎందుకు
శోధిస్తావు నన్ను
మనసు పెట్టి చూడు
విశ్వమంతా నేనే
కనురెప్పలను బలంగా
మూసుకో
విప్పారిన కన్నులను
మరింత తెరిచిచూడు
అనంతశూన్యంలో కనుల
గవాక్షాలను ప్రసరించు
లీలగా మెరిసేది నా
రూపమే
నీ కురులపరదాలను జారి
నేలను ముద్దాడిన మల్లె
మొగ్గను చూడు
మత్తుగా విహరించే
పరిమళంలో
విరిసిన నా నవ్వులే
కనిపిస్తాయి
నీ గులాబీ రేకుల అధరాల
రాలిపడే
మేలి ముత్యాలను చూడు
ఇంద్ర ఛాపమై నేనే
కనిపిస్తా
కనుల కొలనున ఉబికి
పుడమిలోకి ఇంకే
కన్నీటి చుక్కను చూడు
ఆర్తిగా చూసే నా మోము
కనిపిస్తుంది
నీ శ్వాసనిశ్వాసల
లయలను తడిమి చూడు
పరిమళభరితమైన ఊపిరినై
నీలోనే తారాడుతూ ఉంటా
ఎక్కడో ఎందుకు
అద్దంలో నిన్ను నువ్వు
చూసుకో
దర్పణంలో నీ రూపాన్ని
నేనే
మనస్వినీ
No comments:
Post a Comment