ఏ రాగమో అది
ఏ భావమో...
కొన్ని నిమిషాలు
జస్ట్..కొద్ది సేపు
మాత్రమే
చెవులకు హెడ్ ఫోన్స్
పెట్టుకుని
సెల్ ఫోన్ లో మ్యూజిక్
బాక్స్ ఆన్ చేసుకున్నా...
నేను ఎప్పుడూ వినే
పాటలే అవి
సరదాగా వింటూ
ఏదో తెలియని భావలోకంలో
విహరించటం
నాకు అలవాటే...
చాలా కాలం తర్వాత
ఆ గీతాలు చెవులను
తాకాయి మంద్రంగా ...
కోల్పోయిన లోకమేదో
కనులముందు
తారాడింది
ఆ భావాలన్నీ కలగలిసి
అమృతవర్షమై మనసుపై
వర్షిస్తున్నట్టు అనిపించింది
నా నుంచి దూరమైన
జీవితమేదో
నా చెంత నిలిచినట్టు
అనిపించింది...
అందరికీ తెలిసిన
భావాలే
చాలా మంది పాడుకునే
పాటలే
సంగీత ప్రియులకు అవి
ప్రియ సరాగాలే...
అవి నువ్వూ నేనూ
పాడుకున్నాం
ఆ పాటల పదనిసలతో
అల్లరి ఆటలు ఆడుకున్నాం
యుగళ గీతాలుగా
అల్లుకున్నాం
శృతి లయలను పూల
బంతులుగా విసురుకున్నాం...
శివరంజని రాగమా
హంసధ్వని గానమా
మనకు తెలియదు
పాటల పల్లకిలో
ఊరేగిందీ మనమే
భావాల పల్లకీలకు
బోయీలమూ మనమే...
తిరిగిరాని ఆ జ్ఞాపకాల
పుష్పాలు
గుండెకు పువ్వుల్లా
గుచ్చుకుంటే
మనసు తీయని బాధతో
మూలిగింది
కనుల కొలనులను
దాటేందుకు సిద్ధమైన
కన్నీటి చుక్కను బలంగా
అదుముకున్నా
కనురెప్పల మాటున...
ఆ జ్ఞాపకాల సౌరభాలే
నా జీవన ఘడియలు
మనస్వినీ...
No comments:
Post a Comment